విదేశీ నౌకలకు ఘనంగా వీడ్కోలు
♦ రెండు బృందాలుగా అంతర్జాతీయ జలాలకు‘సెయిల్ ఇన్ కంపెనీ’కి ఫ్లాగ్ ఆఫ్ చేసిన వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ
♦ భారత నేవీ హెడ్ క్వార్టర్‌గా విశాఖ ఎదగాలని ఆకాంక్ష
♦ ముగిసిన ‘ఐఎఫ్‌ఆర్’ వేడుకలు
సాక్షి, విశాఖపట్నం: ‘యునెటైడ్ త్రూ ఓషన్స్’ అంటూ ప్రపంచ దేశాల నావికా లోకం ఖండాంతరాలు దాటి విశాఖ తీరానికి చేరింది. నీటిలో, నింగిలో, నేలపై భారత నేవీతో కలిసి సందడి చేసింది. ఐఎఫ్‌ఆర్ విలేజ్, మారిటైమ్ ఎగ్జిబిషన్‌లో మన సంస్కృతి, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని కళ్లారా చూసింది. మధుర స్మృతులను నెమరువేసుకుంటూ స్వదేశానికి పయనమైంది. అంతర్జాతీయ నేవీ సహచరులకు భారత నేవీ అధికారులు మంగళవారం సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దు వరకూ తోడ్కొని వెళ్లి వీడ్కోలు ఇచ్చారు.
రెండు బృందాలుగా..
ఐఎఫ్‌ఆర్-2016లో పాల్గొన్న 20 భారత, 14 విదేశీ నౌకలకు మంగళవారం వీడ్కోలు పలికారు. వాటిని రెండు బృందాలుగా విడదీసి సాగనంపారు. మొదటి బృందానికి రియర్ అడ్మిరల్ రణ్‌వీర్ సింగ్ నేతృత్వంలో ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, రెండో బృందానికి రియర్ అడ్మిరల్ ఎస్‌వి భోకరే నేతృత్వంలోని ఐఎన్‌ఎస్ విరాట్ వీడ్కోలు పలికాయి. ఈ సందర్భంగా పాసెక్స్, ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలు నిర్వహించారు. మరోవైపు ‘సెయిల్ ఇన్ కంపెనీ’ కార్యక్రమాన్ని ఐఎన్‌ఎస్ సుమిత్ర నుంచి తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ నిర్వహించారు. భారత నైకాదళానికి చెందిన మూడు నౌకలు ఎన్‌ఎన్‌ఎస్ తరంగిణి, సుదర్శిని, మదేయిలను విశాఖ నుంచి కోచికి జెండా ఊపి సాగనంపారు.
అంతర్జాతీయ సంబంధాలు బలపడ్డాయి
ఐఎఫ్‌ఆర్‌కు వివిధ దేశాల నేవీ అధికారులు, సిబ్బంది భారత్‌కు రావడంతో అంతర్జాతీయ నేవీ సంబంధాలు మెరుగుపడ్డాయని తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ అన్నారు. మంగళవారం ‘సెయిల్ ఇన్ కంపెనీ’ ఫ్లాగ్ ఆఫ్ అనంతరం ఆయన ఐఎన్‌ఎస్ సుమిత్ర నౌకలో విలేకరులతో మాట్లాడారు. ఐఎఫ్‌ఆర్-2016 విజయవంతంగా ముగిసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అత్యంత క్లిష్టమనుకున్న ఆపరేషనల్ డెమో, ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్‌లను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించడానికి జిల్లా అధికార యంత్రాంగం అందించిన సహకారం మరువలేనిదన్నారు. రక్షణ మంత్రి చెప్పినట్లుగా భారత నేవీ హెడ్ క్వార్టర్‌గా విశాఖ ఎదగాలని తాను కూడా కోరుకుంటున్నానని సోనీ చెప్పారు. భారత్‌లోనే అత్యంత అందమైన నగరం విశాఖ అని అభివర్ణించారు. ఐఎన్‌ఎస్ విరాట్‌ను ఈ ఏడాది డీ కమిషన్ చేస్తామని, విక్రాంత్‌ను 2018లో డీకమిషన్ చేయాలనుకుంటున్నామని ఆయన వెల్లడించారు. విరాట్‌ను విశాఖకు ఇస్తే సంతోషమన్నారు.