కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Published Mon, Sep 26 2016 8:15 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
ఏలూరు (మెట్రో) : తాను ఇచ్చిన ఫిర్యాదును ఎసై ్స పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కలెక్టరేట్ ఆవరణలో పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన సోమవారం ఏలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడుకు చెందిన అచ్యుత నాగరాజు అనే వ్యక్తి వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న 68 గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నుంచి రూ.2.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి చనిపోగా, అతని కుమారులు వచ్చి తన ఇంటిని స్వాధీనం చేసుకున్నారని వాపోయాడు. ఈ విషయమై న్యాయం చేయాలని సమిశ్రగూడెం ఎసై ్సకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపాడు. కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే తిరిగి ఎసై ్స వద్దకే ఆ ఫిర్యాదు పంపిస్తున్నారని, దీంతో చేసేదేమీ లేక ఆత్మహత్యకు యత్నించానని బాధితుడు వాపోయాడు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి వచ్చిన నాగరాజు పురుగుల మందు తాగడంతో పోలీసులు ఏలూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడు కోలుకుంటున్నాడని, ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Advertisement
Advertisement