
వైఎస్సార్‌సీపీకి విశేష స్పందన
బాబు పాలనపై తీవ్రమైన వ్యతిరేకత
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి
పలమనేరు : గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమానికి రాష్ట్రంలో జనం నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పలమనేరులో ఆదివారం ఆయన స్థానిక నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 8న వైఎస్ జయంతి సందర్భంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లోనూ చాలా అద్భుతంగా సాగుతోందన్నారు. ప్రతి గడపలోనూ టీడీపీ పాలనపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. తాము ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేశామా? అని జనం బాధపడుతున్న విషయం ప్రత్యక్షంగా తెలుస్తోందన్నారు.
తాము ప్రతి గడపకూ అందించే వంద ప్రశ్నల కరపత్రం చదివిన జనం బాబు పాలనకు నూటికి ఒకటో రె ండో మార్కులు మాత్రమే వేస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో అమలుకు వీలుగాని హామీలను గుప్పించి, వాటిని అమలు చేయకపోవడంతో జనం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారన్నారు. నాయకులు సీవీ కుమార్, బెరైడ్డిపల్లె కృష్ణమూర్తి, మండీ సుధా, మొగసాల రెడ్డెప్ప, మోహన్‌రెడ్డి, రాజేంద్రన్, కేశవులు, శ్రీరాములు రెడ్డి, చెంగారెడ్డి, శరత్,రాజారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.