
బాబుది మాఫియా రాజ్యం
►ఎర్రచందనం, డబ్బు దోచేస్తున్నారు
►ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టేశారు
►పుంగనూరు వైఎస్సార్ సీపీ ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం
పుంగనూరు/బి.కొత్తకోట : ‘రాష్ట్రంలో అధికార తెలుగుదేశం మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ, నీరు–చెట్టు నుంచి పట్టిసీమ వరకు ప్రజాధనాన్ని దోచేస్తోంది. ప్రజాప్రతినిధులను కాదని, తెలుగుదేశం కార్యకర్తలకు అధికారాన్ని కట్టబెట్టి రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారు. ఈ మాఫియా రాజ్యాన్ని భూస్థాపితం చేయాలి. ఇందుకోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి’ అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక ఆర్‌ఆర్ కల్యాణ మండపంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకులు భూమన కరుణాకరరెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా దివంగత సీఎం డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించారు.
జ్యోతి వెలిగించి ప్లీనరీని ప్రారంభించిన పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు గాలికి వదిలేశారని అన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదని అన్నారు. నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీకి పాల్పడుతూ ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు తీరని అన్యాయం జరుగుతోందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, చాంద్‌బాషాలకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పి మోసగించిందని దుయ్యబట్టారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడంతో సోనియాగాంధీ, చంద్రబాబునాయుడు కుమ్మక్కై తప్పుడు కేసులు నమోదు చేసి, 18 నెలలు జైలులో ఉంచారని, ఆనాటి నుంచి ఆయనకు సమస్యలు తీవ్రమయ్యాయని అన్నారు. జైలులో ఉన్నా జగన్‌మోహన్‌రెడ్డి పట్టుదలతో ప్రజల ఆకాంక్ష నేరవేర్చేందుకు పార్టీని నడిపించారని తెలిపారు. ఎన్నికల్లో చంద్రబాబులాగా తప్పుడు హామీలు ఇచ్చి ఉంటే జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యేవారని అన్నారు. చంద్రబాబు ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని, వాటికి భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి మాట్లాడుతూ పుంగనూరు ప్రజల సమస్యల పరిష్కారానికి తమ కుటుంబం పోరాడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్, రెడ్డెప్ప, నాగభూషణం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నాగరాజారెడ్డి, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వెంకటరెడ్డి యాదవ్ పాల్గొన్నారు.