ఈ పథకాలకు ఏమైంది?
► అభయహస్తం, ఆమ్‌ఆద్మీ అమలులో అంతులేని నిర్లక్ష్యం
► రెండింటిలోనూ జిల్లా లాస్ట్
► అవగాహన లోపంతోనే సమస్య
ప్రచార లేమి.. అవగాహన లోపం.. ఆపై అధికారుల బాధ్యతారాహిత్యం.. వెరసి అభయహస్తం, ఆమ్‌ఆద్మీ పథకాలు అటకెక్కాయి. ఫలితంగా కొందరు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాల అమలులో రాష్ట్రంలోనే జిల్లా చివరిస్థానంలో ఉంది.
కోవూరు: జిల్లాలో అభయహస్తం పథకంలో 1,36,194 మంది ఉన్నారు. వారిలో 62,353 మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. ఈ పథకం సభ్యులు సాధారణంగా మృతి చెందితే రూ.30 వేలు, పూర్తి అంగవైకల్యం అయితే రూ.37,500, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.70 వేలు అందుతోంది. సభ్యులకు 60 సంవత్సరాలు పైబడితే నెలకు రూ.500 నుంచి రూ.2,200 వరకు పింఛను పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ఆమ్‌ఆద్మీ విషయానికి వస్తే మొత్తం 1,13,349 మంది సభ్యులున్నారు.
వీరిలో 61,835 మంది మాత్రమే రెన్యువల్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందులో 8406 మంది ఆమ్‌ఆద్మీకి అర్హులు కాదంటూ నిర్ధరించి వాటిని అధికారులు తొలగించారు. ఈ పథకంలో వివి ధ రకాల పనులు చేసే కూలీలతో పాటు బయట వ్యక్తులకు కేవలం రూ.15 చెల్లిస్తే ఈ పథకంలో రెన్యూవల్ చేసుకున్నారు. ప్రభుత్వం వీరి తరఫున మరో రూ.320 జమ చేస్తుంది.
సగంమంది మాత్రమే:
డీఆర్‌డీఏ అధికారుల నిర్లక్ష్యంతోనే రెండు పథకాల అమలు నత్తనడకన సాగుతోంది. పథకాలపై అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. రెన్యువల్ చేయడంలోను సిబ్బంది శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా చివరిస్థానంలో ఉంది.
రెన్యువల్ చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు:
అభయహస్తం,ఆమ్‌ఆద్మీ పథకాల రెన్యువల్ చేయించుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కేవలం అధికారుల లెక్కల కోసమే చెబుతున్నారు. మే ము కట్టిన డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి.- రమణమ్మ, చెర్లోపాళెం
సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉంది:
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆమ్‌ఆద్మీ, అభయహస్తం పథకాలను రెన్యువల్ చేయడంలో నెల్లూరు జిల్లా చివరిస్థానంలో ఉండటం వాస్తవమే. ఇందుకు సిబ్బంది నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది సిబ్బందికి మెమోలు జారీ చేసాం. కొందరు సకాలంలో పనిచేసిన మరికొందరు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. అభయహస్తం, ఆమ్‌ఆద్మీలకు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పడం వాస్తవమే. -మురళీ, ఇన్సూరెన్స్ డీపీఎం