
2013 చట్టం ప్రకారం భూసేకరణ చేయాలి
తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూసేకరణ చట్టం– 2013 ప్రకారం పరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం రాజేశ్ డిమాండ్ చేశారు.
► హైకోర్టు తీర్పు హర్షణీయం
► ‘నకిలీ’ రుణాలపై విచారణ వేగవంతం చేయాలి
► వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం రాజేశ్
మంథని : తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూసేకరణ చట్టం– 2013 ప్రకారం పరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం రాజేశ్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ సెంటర్‌లో మల్హర్, కాటారం, మహదేవపూర్ మండల పరిధిలోని సుమారు 50మందికి పైగా వివిధ పార్టీల నాయకులు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ 123 జీవో ప్రకారం భూసేకరణ చేపడితే భూనిర్వాసితులకు అన్యాయం జరుగుతుందన్నారు. 2013 భూసేకరణ చట్టం ద్వారా నిర్వాసితులకు పలు హక్కులు, ప్రయోజనాలతోపాటు మెరుగైన పరిహారం అందుతుందని పేర్కొన్నారు. జీవో 123 భూసేకరణ విరుద్ధమని హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఇది చెంప పెట్టులాంటిదని అన్నారు.
కొయ్యూర్, తాడిచర్లలోని తెలంగాణ దక్కన్ గ్రామీణ బ్యాంకుల్లో నకిలీపాస్‌పుస్తకాలతో రుణాలు పొందిన వారిపై విచారణను వేగవంతంచేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పార్టీలో చేరిన వారిలో దుర్గయ్య, లింగయ్య, మల్లయ్య, పెంటయ్య, మునీర్, గుంపుల యశ్వంత్, కత్తరమల్ల వర్మ ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కాసిపేట సారయ్య, మల్హర్ మండల అధ్యక్షుడు సుంకె వెంకటి, మేలికంటి కళ్యాణ్, మేలికంటి శ్రీకాంత్, ఎడ్ల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి కొండ్రా దుర్గయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు శనిగారపు పేంటయ్య, ఉపాధ్యక్షుడు శనిగరపు లింగయ్య పాల్గొన్నారు.