ప్రొద్దుటూరు కల్చరల్: బీసీ కార్పొరేషన్ ద్వారా నాయీబ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీలకు మంజూరైన సొమ్మును పట్టణ నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మల్లు సంజీవకర్ణ ఉషాశ్రీ అనే బినామీ సంస్థకు నిధులు మళ్లించారని ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారుడు ఎం.నారాయణ ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సొసైటీలోని ఒక్కో సభ్యునికి రూ.50వేలు రుణం మంజూరైందని, అందులో రూ.25వేలు సబ్సిడీగా ఉందని తెలిపారు. సంజీవకర్ణ అన్ని సొసైటీలకు మంజూరైన మొత్తాన్ని తన బినామీ సంస్థకు మళ్లించుకున్నారన్నారు. మంజూరైన రూ.50వేలులో కొంత మందికి రూ.8వేలు, మరికొంత మందికి రూ.10వేలు ఇచ్చి, ఇంకొందరికి నిధులు మంజూరైన విషయం తెలియకుండా స్వాహా చేశారని చెప్పారు. ఈ విషయమై నాయీబ్రాహ్మణ సొసైటీ సభ్యులు రాష్ట్ర నాయీబ్రాహ్మణ సంఘం నాయకులకు ఫిర్యాదు చేశారన్నారు. వారు జిల్లా కలెక్టర్‌కు, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసి జిల్లా సంఘం నుంచి అతన్ని బహిష్కరించారని తెలిపారు. ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు వీరభద్రుడు, బాధితులు మంగళి శ్రీనివాసులు, పాలెం గంగన్న, ఆదెన్న, నరసింహం, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.