అక్రమార్కులపై చర్యలు
► గరిమెనపెంట భూముల్లో అక్రమాలు జరిగాయని నివేదిక అందింది
► కలెక్టర్ ముత్యాలరాజు
రాపూరు(వెంకటగిరి): రాపూరు మండలంలోని గరిమెనపెంట గ్రామంలోని సర్వే నంబర్ 75–2ఏలోని 550 ఎకరాల భూముల్లో అక్రమాలు జరిగినట్లు నివేదిక అందిందని, రెండు రోజుల్లో అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ముత్యాలరాజు పేర్కొన్నారు. రాపూరు తహసీల్దార్ కార్యాలయాన్ని, గుండవోలు పునరావాస కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గరిమెనపెంట భూములపై గూడూరు ఆర్డీఓ అరుణ్‌బాబుతో విచారణ చేయించామని తెలిపారు.
ఆయన ఇచ్చిన నివేదికలో అక్రమాలు జరిగినట్లు తేలిందన్నారు. రెండు రోజుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. గుండవోలు పునరావాస కేంద్రానికి సంబంధించి 148 ఎకరాల్లో 888 మందికి ఇళ్ల స్థలాలు అందించామని తెలిపారు. ఈ స్థలం గతంలో ఎస్‌ఎఫ్‌ఆర్ రీసార్ట్స్ వారి ఆ«ధీనంలో ఉన్నప్పుడు తెలిపారు. వారు తమ స్థలంలో అభివృద్ధి చేస్తామని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ స్థలం వివరాలపై క్షేత్ర స్థాయిలో విచారణ జరుపుతామని తెలిపారు.
పునరావాస కేంద్రంలో త్వరితగతిన ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. గ్రామస్తులు తమకు విద్యుత్ కనెక్షన్ అందించలేదని, విద్యుత్ సరఫరా ఇస్తే వెంటనే ఇళ్లు నిర్మించుకుంటామని కలెక్టర్‌కు తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణారావు, సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.