అనంతపురం ఎడ్యుకేషన్ : కొందరు టీచర్లు పిల్లలకు చదువు చెప్పడం మానేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మునిగి తేలుతున్నారని, అలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ హెచ్చరించారు. శనివారం స్థానిక సైన్స్ సెంటర్‌లో నిర్వహించిన ఎంఈఓల సమావేశంలో డీఈఓ మాట్లాడారు. గోరంట్లలో ఇద్దరు టీచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పాఠశాలలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదులు అందాయన్నారు. విచారించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఈఓలు, డీవైఈఓలు చొరవ తీసుకుని ఇలాంటి వారిపై నిఘా ఉంచాలన్నారు. వారిని సస్పెండ్ చేస్తూ నివేదికలు పంపాలని ఆదేశించారు.