చలపతిరావును సత్కరిస్తున్న నందమూరి లక్ష్మీ పార్వతి
వివేక్‌నగర్: తెలుగు చలనచిత్ర రంగంలో నాలుగు దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక శైలిని చాటుకున్న చలపతిరావు స్వయం కృషితో ఉన్నత స్థానానికి ఎదిగిన మనసున్న మంచి మనిషి అని రచయిత్రి డా.నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. తేజస్విని కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం త్యాగరాయ గానసభలో జరిగిన అక్కినేని గీతామృత వర్షిణి, అక్కినేని విశిష్ఠ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాలుగు తరాల నటులతో నటించే అరుదైన అవకాశం చలపతి రావుకు దక్కిందన్నారు.
ఆయన క్రమశిక్షణ నేటి యువ నటులకు ఆదర్శమన్నారు. డా.ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ స్వర్గీయ ఎన్.టి.ఆర్‌కు అత్యంత సన్నిహితులైన చలపతిరావు విలన్‌గా, కారెక్టర్ నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారన్నారు. అనంతరం చలపతిరావును అక్కినేని విశిష్ట పురస్కారంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డా.కె.వి.కృష్ణకుమారి, జె.నారాయణ రావు, డా.విజయలక్ష్మి, రవికుమార్, యస్.యన్.సుధారాణి, పురస్కార గ్రహీత చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.