సాక్షి, గుంటూరు: చంద్రబాబు నాయుడుని నమ్మిన ఏ ఒక్కరు కూడా బాగు పడినట్లు చరిత్రలో లేదని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబు అడుగులకు మడుగులు నొక్కుతున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పరిస్థితి కూడా అంతేనన్నారు. చంద్రబాబు ప్రలోభాలకు లోనై నిమ్మగడ్డ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా ఎలా ప్రవర్తిస్తాడో చెప్పటానికి నిమ్మగడ్డ ఓ ఉదాహరణ అన్నారు. నిమ్మగడ్డ తీరును అందరూ వ్యతిరేకిస్తున్నా, ఆయనలో ఏమాత్రం చలనం లేదని.. ఆయన చంద్రబాబు మైకంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. సకల పాపాలకు కేంద్ర బిందువైన చంద్రబాబు మాటలను ఒక ఐఏఎస్ చదివిన వ్యక్తి ఎలా నమ్ముతున్నాడో అర్ధం కావట్లేదన్నారు.
గాంధీ తర్వాత గ్రామ స్వరాజ్యానికి కోరుకున్న వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని, ఆయన ఏడాదిన్నర పాలనే ఇందుకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పని చేస్తుంటే, కొన్ని అరాచక శక్తులు అందుకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కరోనా క్లిష్ట సమయాల్లో కూడా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తుంటే, చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని జూమ్ యాప్ ద్వారా కార్యకర్తలను రెచ్చగొడుతూ హత్య రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే చంద్రబాబు విగ్రహలను ధ్వంసం చేయిస్తున్నాడని తెలిపారు.
నిమ్మగడ్డ రమేష్ ఓ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నాడని, త్వరలో ఆయన తగిన మూల్యం చెల్లించుకుంటాడని ఆమె జోస్యం చెప్పాడు. కాగా, తెలుగు అకాడమీ ప్రధాన కార్యాలయం త్వరలో తిరుపతి నుండి కార్యకలాపాలు సాగించనుందని, ఇప్పటికే తిరుపతిలో ఆఫీస్, పుస్తకాలు భద్రపరిచే గోడౌన్ వసతులు సమకూరాయని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరానికంతా ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాలు ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తెలుగు అకాడమీని పట్టించుకోలేదని, సీఎం జగన్ తెలుగు అకాడమీపై ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. త్వరలో ప్రభుత్వం సంస్కృత అకాడమీని ప్రారంభించనుందని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment