
బంజారాహిల్స్‌లో పూర్ణ సందడి
సాక్షి, సిటీబ్యూరో: భారతీయ వస్త్రధారణలో చీరకు ఉన్న ప్రత్యేకత సాటిలేనిదని, అందుకే అది విశ్వవ్యాప్తంగా ఆకట్టుకుంటోందని సినీనటి పూర్ణ (అవును ఫేం) అన్నారు. నగరానికి చెందిన డిజైనర్ స్వరూపారెడ్డి బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన డిజైనర్ ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఎస్‌ఆర్ ఫ్యాషన్ స్టూడియోను మాజీ మంత్రి డికె అరుణతో కలసి ఆమె ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యాధునిక వస్త్రరీతులు ఎన్ని వస్తున్నా సంప్రదాయ చీరకట్టుకు ఆదరణ తగ్గలేదన్నారు. మాజీ మంత్రి డి.కె.అరుణ మాట్లాడుతూ నవతరం అభిరుచులకు తగ్గ దుస్తులను అందించడం ద్వారా భారతీయ డిజైనర్లు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తుండటం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో డిజైనర్ స్వరూపారెడ్డి, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి, వర్ధమాన నటి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.