
మాట్లాడుతున్న ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ పాపయ్య
సాక్షి,సిటీబ్యూరో: ‘‘జీవితం చాలా విలువైనది. ఒక్కసారి దానిని కోల్పోతే తిరిగిరాదు. మైనర్లకు వాహనాలిచ్చి వారి జీవితాలతో ఆడుకోవద్దు’’.. అని ట్రాఫిక్ నార్త్ డిస్ట్రిక్ అడిషనల్ డీసీపీ పాపయ్య తల్లిదండ్రులకు సూచించారు. డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (టీటీఐ)లో గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ పాపయ్య మాట్లాడుతూ... డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఎంవీఐ యాక్ట్ ప్రకారం నడిపిన వారితో పాటు వాహనం యజమానిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
వాహన యజమానికి రూ.1200ల చలాన్ విధించి కౌన్సెలింగ్ చేస్తామన్నారు. నగర రహదారులపై ప్రమాదాలు నియంత్రించేందుకే మైనర్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మైనర్లు డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే వారికి మద్యం సరఫరా చేసిన బార్, వైన్‌షాపుల లైసెన్స్ రద్దుకు ఎక్సైజ్‌శాఖకు సిఫారసు చేస్తామన్నారు. అలాగే మైనర్ల సమాచారాన్ని వారు చదువుకొనే విద్యా సంస్థలకు, పెద్దలైతే వారు పనిచేసే సంస్థలకు తెలియజేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.