అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణలో ఆదోని ఫస్ట్
టౌన్ ప్లానింగ్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ వెంకటపతిరెడ్డి
ఆదోని టౌన్: అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణలో రీజియన్‌లో ఆదోని, ప్రొద్దుటూరు ప్రథమ స్థానంలో నిలిచాయని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ వెంకటపతి రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తన సహచర ఉద్యోగులతో కలిసి ఆదోని మున్సిపాలిటీని సందర్శించారు. అర్ధాంతరంగా ఆగిపోయిన ఆస్పరి బైపాస్ రోడ్డును పరిశీలించారు. పట్టణంలో పలు వార్డుల్లో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు చేసుకున్న వారి ఆస్తులు, కట్టడాలను పరిశీలించారు. అనంతరం టౌన్‌ప్లానింగ్ సెక‌్షన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన 10,346 దరఖాస్తుల్లో 5వేలు పరిష్కారమయ్యాయన్నారు. తద్వారా ప్రభుత్వానికి రూ.496 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. క్రమబద్ధీకరణ చేసుకోని యజమానులు ఈ నెలాఖరు వరకు గడువు ఉందని త్వరగా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని లేనిపక్షంలో భవిష్యత్తులో ఆస్తులపై పన్నులు రెట్టింపు విధించడం లేదా భవంతులు కూల్చివేయడం జరుగుతుందన్నారు. భవంతుల నిర్మాణం, ఇతరత్రా వాటి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి 24గంటల్లోగా అనుమతి లభిస్తుందన్నారు. ఆన్‌లైన్‌లో మంజూరు మేరకే నిర్మాణాలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా భవంతులు నిర్మించుకున్నట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో టీపీఏలు భాస్కర్, జయరామ్, ఆదోని టౌన్‌ప్లానింగ్ అధికారి మహబూబ్ బాషా ఉన్నారు.