మళ్లీ మొదలైంది
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో ఇసుక దోపిడీకి మళ్లీ తెరలేచింది. ప్రభుత్వ కార్యక్రమాలను సాకుగా చూపించి గోదావరి నదినుంచి ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. అనుమతి ఇచ్చిన చోటే కాకుండా వేరే ప్రాంతాల్లోనూ తెగ తవ్వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి కూతవేటు దూరంలో గోదావరి ఇసుకను రెండు రోజులుగా దర్జాగా తరలించుకుపోతున్నారు. ఈ ప్రాంతంలో ర్యాంపు ఏర్పాటుకు అనుమతి లేకపోయినా ఇసుకను తవ్వి రవాణా చేస్తున్నారు. పోలవరం కుడి ప్రధాన కాలువ పనుల పేరుతో దందా సాగిస్తున్నారు. ఇసుక తరలించే వాహనాలపై పోలవరం రైట్ మెయిన్ కెనాల్, 4 ప్యాకేజీ (పెదవేగి) అని రాసిన స్టిక్కర్లను అతికించారు. ఇక్కడ ఇసుక తవ్వకాలకు నియోజకవర్గంలోని ఒక ప్రజాప్రతినిధి అండదండలు ఉండటంతో అధికార యంత్రాంగం అటు వైపు కన్నెత్తి చూడలేదు.
అనధికార అనుమతితో..
పోలవరం కుడి ప్రధాన కాలువ రెండవ ప్యాకేజీలో 14.92 కిలోమీటర్ల వద్ద, 4వ ప్యాకేజీలో పెదవేగి వద్ద కట్టడాలు, కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. రెండో ప్యాకేజీలో పనులకు సంబంధించి పట్టిసీమ డెలివరీ పాయింట్ వద్ద మేట వేసిన ఇసుకను తవ్వుకునేందుకు ఇరిగేషన్ ఉన్నతాధికారులు అనధికార అనుమతి ఇచ్చారు. దీంతో ఇక్కడ కొంతమేర ఇసుకను తవ్వి తరలించారు. అదే ముసుగులో పోలవరం ప్రాజెక్ట్ సమీపంలో గోదావరి ఇసుకను అక్రమంగా తవ్వుకుపోతున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలను అధికారులు గతంలోనే నిలిపివేశారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను చూసేం దుకు కేంద్ర బృందం వచ్చినప్పుడు ఇక్కడి తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్ట్ దిగువ భాగంలో తవ్వకాల వల్ల ప్రాజెక్ట్‌కు సమస్య వస్తుందని వారు అభ్యంతరం చెప్పడంతో జిల్లా కలెక్టర్ ఈ పనులను నిలిపివేయించారు. తిరిగి ఇప్పుడు తవ్వకాలు మొదలయ్యాయి. ఇదిలావుంటే పోలవరం మండలం గూటాల వద్ద మరో ఇసుక ర్యాంపు సిద్ధమవుతోంది. అభివృద్ధి పనులకు సంబంధించి తమకు అనుమతి వచ్చిందని చెబుతున్నారు. త్వరలో ఈ ర్యాంపులోనూ తవ్వకాలు మొదలు కానున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ సమీపంలో ఇసుక తవ్వకాలపై తహసీల్దార్ ఎం.ముక్కంటిని వివరణ కోరగా.. అక్కడ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. దీనిపై విచారణ జరుపుతామన్నారు.