లస్కర్ల ఆందోళన
విధి నిర్వహణలో ఉన్న వర్క్ ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేసిన రైతును అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నాగార్జునసాగర్..
* వర్క్‌ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేసిన రైతును
అరెస్ట్ చేయాలని డిమాండ్
నరసరావుపేట: విధి నిర్వహణలో ఉన్న వర్క్ ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేసిన రైతును అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని లింగంగుంట్ల సర్కిల్ పరిధిలోని లస్కర్లు, వర్క్ ఇన్lస్పెక్టర్లు సుమారు 400 మంది గురువారం విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. గురువారం సాయంత్రం ఆశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మొహిద్దీన్‌ను చుట్టుముట్టి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
దీనిపై ఉద్యోగులు మాట్లాడుతూ...యడ్లపాడు నీటిపారుదల శాఖలో వర్క్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.నాగేశ్వరరావు 18/6వ మైలు రాయి వద్ద విధి నిర్వహణలో ఉండగా సమీపంలోని రైతు ఎన్.శ్రీరామమూర్తి ఆయిల్ ఇంజిన్‌లతో తన పొలానికి నీరు పెట్టుకుంటుండగా వారించాడని, దీనిపై రైతు వర్క్‌ఇనస్పెక్టర్ గొంతు పట్టుకొని దుర్భాషలాడుతూ కొట్టాడని తెలిపారు. నాగేశ్వరరావు సంబంధిత ఏఈకి తనపై జరిగిన దాడిని గురించి తెలియచేసి యడ్లపాడు పోలీసులకు ఫిర్యాదుచేశాడని, అయితే మంత్రి పత్తిపాటి పుల్లారావు చెబితేనే ఫిర్యాదును స్వీకరిస్తామని పోలీసులు చెబుతున్నారని ఉద్యోగులు ఆరోపించారు. రైతును శుక్రవారం నాటికి అరెస్టు చేయిస్తామని ఈఈ హామీ ఇచ్చినా కేసు నమోదుచేసి అరెస్టు చేసేంతవరకు తాము విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు. దీంతో బాధితుడిని తీసుకువెళ్లి పోలీసులకు ఫిర్యాదుచేయాలని ఏఈని ఈఈ మొహిద్దీన్ ఆదేశిస్తూ ఎస్.ఇ రామప్రసాదుకు పరిస్థితి వివరించారు. దీంతో తాను కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళానని, ఆయన ఏఎస్పీతో మాట్లాడారని, కేసు నమోదు చేసి రైతును అరెస్టు చేస్తామని హామీ ఇచ్చినందున ఉద్యోగులు విధులకు హాజరుకావాలని ఎస్‌ఈ ఫోన్ ద్వారా ఉద్యోగులకు చెప్పారు. అయినా రైతును అరెస్టుచేస్తేనే తాము ఉద్యోగాలు చేస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు.