
ప్రభుత్వ విధానాలతో వ్యవసాయం భారం
ఖమ్మం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో రైతులు వ్యవసాయం చేయలేని పిరిస్థితి ఏర్పడిందని, వ్యవసాయ రంగం భారంగా మారిందని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. 2015–16 సీజన్ కంటే 2016–17 సీజన్‌లో ధరలు భారీ గా పతనమయ్యాయని, కేంద్ర ప్రభుత్వం పం టల ఉత్పత్తులకు పెంచిన ధరులు ఏ ప్రాతిపదికన పెంచారో తెలపాలని డిమాండ్ చేశారు.
వరి పండించేందుకు క్వింటాల్‌కు రూ.2,200, పత్తికి రూ.5 వేలు, మిర్చికి రూ.7,500 ఖర్చు వస్తుంటే మద్దతు ధరలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయన్నారు. జీఎస్టీతో రైతులపై మరో పిడుగు పడిందని, ఎరువులపై పన్ను వేసి ధరలు మరోసారి పెంచబోతున్నారని మండిపడ్డారు. గత సీజన్‌లో మిర్చితో వచ్చిన నష్టానికే రైతులు కోలుకోలేకపోతున్నారని, ఇప్పుడు మద్దతు ధరలు లేకపోవడం, పన్నుల రూపంలో ఎరువుల ధరలు పెంచడంతో వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రైతు సదస్సు ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సుకు ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి హాజరవుతారని చెప్పారు. సమావేశంలో నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, గుర్రం అచ్చయ్య, మలీదు నాగేశ్వరరావు, శివలింగ, సీవై పుల్లయ్య, జీ రామయ్య తదితరులు పాల్గొన్నారు.