కూరగాయల పంటల్లో సస్యరక్షణ
అనంతపురం అగ్రికల్చర్ : నవంబర్ మాసంలో కూరగాయల పంటలకు ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు.
► మిరపలో ఎదబెట్టిన పొలాల్లో మూడవ దఫా కింద హెక్టారుకు 130 కిలోలు యూరియా, 40 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ) ఎరువులు వేయాలి. నాటిన పొలాల్లో రెండో దఫా కింద కూడా పైన తెలిపిన విధంగా ఎరువులు వేసుకోవాలి. తెల్లనల్లి నివారణకు 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లేదా 5 మి.లీ డైకోఫాల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పేనుబంక నివారణకు 1.5 గ్రాములు అసిఫేట్ లేదా 2 మి.లీ మిథైల్‌డెమటాస్ లేదా 0.3 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. పూత పురుగు ఉన్నట్లు గమనిస్తే మొదట 1.25 మి.లీ ట్రైజోఫాస్, వారం రోజుల తర్వాత 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పొలంగట్ల మీద కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఇటీవలి కాలంలో మిరపను ఎక్కువగా నష్టపరిచే జెమినీవైరస్, కుకుంబర్ మొజాయిక్ వైరస్, పీనట్ బ్లడ్ నెక్రోసిస్ వైరస్‌ల వ్యాప్తికి దోహదపడే రసంపీల్చు పురుగులైన తెల్లదోమ, పేనుబంక, తామరపురుగులను నివారించుకోవాలి. పొలంలో అక్కడక్కడా ఆముదం లేదా గ్రీసు పూసిన పసుపురంగు అట్టలు ఉంచితే తెల్లదోమ ఉనికి, ఉధృతి తెలుస్తుంది. అలాగే లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వైరస్ తెగులు సోకిన మొక్కలు పీకి నాశనం చేయాలి. అవసరాన్ని బట్టి నల్లరేగడి నేలలో 20 నుంచి 25 రోజులకోసారి, ఎర్రనేలల్లో 10 నుంచి 15 రోజులకోసారి నీటి తడులు ఇవ్వాలి.
► రబీ పంటగా ఉల్లిని ఇపుడు నారు పోసుకోవచ్చు. ఖరీఫ్‌లో సాగు చేసిన ఉల్లిని తొలగించవచ్చు. కోతలకు 15 రోజుల ముందుగా నీరు పెట్టడం ఆపివేయాలి. ఉల్లి నాటుకున్న 100 నుంచి 110 రోజుల సమయంలో 1 గ్రాము కార్బండిజమ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే గడ్డకుళ్లు చాలా వరు తగ్గుతుంది. గడ్డలు ఊరి 50 శాతం మొక్కల మొదళ్లు నేలకు వాలిపోగానే పీకి నీడలో ఒక వారం ఆరబెట్టి తర్వాత గ్రేడింగ్ చేసి నిల్వ చేసుకోవాలి.
► చామంతిలో పూర్తీగా విచ్చుకున్న పూలను తెంపి మార్కెట్‌కు తరలించాలి. రసం పీల్చు పురుగుల నివారణకు 1 గ్రాము అసిఫేట్Š‡ లేదా 2 మి.లీ డైమిథోయేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
► బంతిలో ప్రధాన కొమ్మల చివర్లను తుంచి పైపాటుగా సిఫారసు చేసిన ఎరువులు వేసుకోవాలి.
► నేలసంపంగికి రెండో దఫా ఎరువులు వేసుకోవాలి. మల్లెలో కొమ్మలు కత్తిరించాలి.