గణేశ్ మండపాల నిర్వాహకులకు అవగాహన కల్గిస్తున్న పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగం ప్రతి ఏటా అనేక ఉత్సవాలు, సందర్భాలకు బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తుంది. అయితే అన్నింటికంటే గణేష్ ఉత్సవాలు, ఆఖరి రోజు జరిగే సామూహిక నిమజ్జనం అత్యంత కీలకమైనవి. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అన్ని విభాగాలూ రంగంలోకి దిగాయి. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎవరికి వారు తమ బాధ్యతల్ని నిర్వర్తించడంపై దృష్టిపెట్టారు.
శాంతిభద్రతల విభాగం అధికారులు స్థానికంగా ఉన్న మండపాలు, నిమజ్జన ఊరేగింపు జరిగే మార్గాలపై దృష్టి పెట్టగా., ప్రత్యేక విభాగాలు ఇతర అంశాలపై చర్యలు తీసుకుంటున్నాయి. గణేష్ మండపాలతో పాటు నిమజ్జనం ఊరేగింపు నేపథ్యంలో డీజేలు, పరిమితికి మించి శబ్ధం చేసే సౌండ్ సిస్టమ్స్ వెలుస్తుంటాయి. వీటి కారణంగా కొన్నిసార్లు ఘర్షణలు చోటు చేసుకుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు డీజే, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసేవారితో సమావేశమయ్యారు.
మండపాల వద్ద, ఊరేగింపులోను పరిమితికి మించిన శబ్ధం చేసే సౌండ్ సిస్టమ్స్‌తో పాటు డీజేలు ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేశారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి, సౌత్‌జోన్ ఇన్‌స్పెక్టర్ ఎ.యాదగిరి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో దీనికి సంబంధించి కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల్ని నిర్వాహకులకు తెలియజేశారు. వీటిని అతిక్రమిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోపక్క మండపాలతో పాటు ఊరేగింపులో ఈవ్‌టీజింగ్ ఇతర వేధింపులు లేకుండా చూడటంపై సీసీఎస్ ఆధీనంలోని ‘షీ–టీమ్స్’ చర్యలు చేపట్టాయి.
ఇందులో భాగంగా ప్రత్యేక బృందాలు మండపాల వద్దకు వెళ్లి నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నాయి. మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడానికి షీ–టీమ్స్ ఇటీవల రూపొందించిన పాటల సీడీలను మండపాల వద్ద పంపిణీ చేస్తున్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ఈ బృందాలు పోకిరీల కోసం మాటువేసి ఉంటున్నాయి.