శాఖలన్నీ ప్రక్షాళన చేస్తా
♦ రాష్ట్రంలోని పేదరికానికి కాంగ్రెస్ విధానాలే కారణం: బాబు
♦ ‘సీమ’ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా!
సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘‘రెవెన్యూశాఖలో లోపాలవల్ల ఒకరి భూమిని ఇంకొకరు రాయించుకున్నటు వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ‘మీభూమి-మీఇంటికి’ కార్యక్రమం ద్వారా రెవెన్యూశాఖ ప్రక్షాళన చేపట్టాం. అవినీతికి అడ్డుకట్ట వేశాం. మూడ్నాలుగు నెలల్లో రెవెన్యూశాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తా. తరువాత పోలీసు, ఆరోగ్యశాఖలను కూడా ప్రక్షాళన చేసి జవాబుదారీతనాన్ని పెంచుతాం’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. మంగళవారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన పోలీసు ట్రైనింగ్ కాలేజీ(పీటీసీ)లో నిర్వహించిన ఎస్‌ఐల పాసింగ్ అవుట్ పెరేడ్‌లో పాల్గొన్నారు. తర్వాత ఆత్మకూరు మండలం కొత్తపల్లి, కొండపల్లిలో హంద్రీ-నీవా పనుల్ని పరిశీలించారు. అధికారులతో సమీక్ష జరిపారు. తదుపరి తలుపూరులో ‘మీఇంటికి-మీభూమి’ గ్రామసభలో మాట్లాడారు.
‘‘రాష్ట్రంలోని పేదరికానికి కాంగ్రెస్ విధానాలే కారణం. నేను సీమలో పుట్టాను. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా. హంద్రీ-నీవా ఫేజ్-1 పూర్తి చేశాం. ఫేజ్-2కూడా త్వరలో పూర్తి చేస్తాం. మార్చిలోపు మడకశిర వరకూ నీరు తీసుకెళతాం. కరువుతో వెనుకబడిన ‘అనంత’ను నంబర్-1 జిల్లాగా చేస్తాం. ఈ ఏడాది 39 కరువు మండలాలను ప్రకటించాం. తక్కిన మండలాలను ప్రకటించేందుకు నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. వాటినీ పరిశీలిస్తాం’’ అని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు దేవినేని ఉమా, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ఎంపీలు కిష్టప్ప, జేసీ దివాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
గండికోటను తీర్చిదిద్దుతాం: సీఎం
జమ్మలమడుగు: ‘‘ అమెరికాలో ఉన్న గ్రాండ్ కె న్యాన్ తరహాలో గండికోట ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం’ అని చంద్రబాబు చెప్పారు. సోమవారం రాత్రి వైఎస్సార్ జిల్లా గండికోట వద్ద నిద్రించిన ఆయన మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ రూ.17 కోట్లతో గండికోట రహదారిని అభివృద్ధి చేస్తామన్నారు.