గాయత్రీ ర్యాంపు వద్ద గురువారం రికార్డులు తనిఖీ చేస్తున్న అర్బన్ తహసీల్దార్ రాజేశ్వరరావు
♦ ఇసుక అక్రమార్కులపై చర్యలు నిల్
♦ గాయత్రీ ర్యాంపులో రెట్టింపు ధరలపై ఫిర్యాదులు
♦ తూతూమంత్రం తనిఖీలతో సరిపెడుతున్న రెవెన్యూ యంత్రాంగం
♦ పక్కా ఆధారాలున్నా మౌనం వెనుక మర్మమేమిటో..?
♦ రెవెన్యూ అధికారులను నిలువరిస్తున్న ‘పవర్’
సాక్షి, రాజమహేంద్రవరం :
రాజమహేంద్రవరంలోని ర్యాంపుల్లో అక్రమాలను ఆపేందుకు అవసరమైతే రంగ ప్రవేశం చేస్తానన్న సీఎం చంద్రబాబుకి నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఇసుక దందా కనిపించడం లేదా అని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇసుక విక్రయాల్లో అక్రమాలకు పాల్పడేవారిపై పీడీ చట్టం కింద కేసులు పెట్టాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. యంత్రాంగం నియంత్రించలేకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. అయినా జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం మాత్రం ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నా కూడా చేష్టలుడిగిచూస్తోంది. కొనుగోలుదారులు ఫిర్యాదులు చేసి, పక్కా ఆధారాలున్నా కూడా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతోంది.
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం కేతావానిలంకలోని గాయత్రి–1,2 ఇసుక ర్యాంపుల్లో రెండున్నర యూనిట్ల ఇసుక రూ.4,200 నుంచి రూ.4,500ల మధ్య వసూలు చేశారని కాకినాడకు చెందిన ది క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, సంస్థ కోశాధికారి గాది బాబ్జి తదితరులు మంగళవారం రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం గాయత్రీ, కోటిలింగాలఘాట్ వద్ద ఉన్న ర్యాంపులను అర్బన్ తహసీల్దార్ రాజేశ్వరరావు సందర్శించారు కూడా.
ఆదిలో ఆపకుండా అంతంలో హల్‌చల్...
గత నెల రోజుల నుంచీ గాయత్రీ ర్యాంపుల్లో రెండు యూనిట్ల ఇసుక ధర రూ.2,250కి బదులుగా రూ.4,500 లెక్కన రెట్టింపు ధర వసూలు చేస్తున్నారని లారీ ఓనర్లు చేసిన ఫిర్యాదు మేరకు స్పష్టమైంది. గత నెల 15వ తేదీ నుంచీ నూతనంగా ఏర్పాటు చేసిన కోటిలింగాలఘాట్ ర్యాంపు పని చేస్తోంది. అంతకు ముందు కేవలం గాయత్రీ–1,2 ర్యాంపుల్లో మాత్రమే ఇసుక లభిస్తోంది. ఇన్ని రోజుల పాటు యథేచ్ఛగా ఇసుకను రేవులోనే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విరుద్ధంగా విక్రయిస్తున్నా రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తోందన్న ప్రశ్నకు సమాధానం లేదు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో గనులు, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు బృందం గాయత్రీ ర్యాంపు నుంచి ఇసుకతో వస్తున్న 15 లారీలను నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా మూడు యూనిట్ల లోడు, అధికధరలకు కొనుగోలు చేశారన్న కారణంగా లారీ డ్రైవర్లను విచారణ చేశారు. 15 లారీల్లో 10 లారీలను కొద్దిసేపటి తర్వాత వదిలేసిన యంత్రాంగం మిగతా ఐదు లారీలను మాత్రం అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి తరలించింది. ఒక లారీని కార్యాలయ ఆవరణలో పెట్టగా మరో నాలుగు లారీలను ఎదురుగా ఉన్న బాలికోన్నత పాఠశాల్లో ఉంచింది. ఉదయం 9 గంటలకు అదుపులోకి తీసుకున్న లారీ డ్రైవర్లు, ఆ తర్వాత వచ్చిన ఓనర్లను రాత్రి 8 గంటలకు వరకు అక్కడే కూర్చో పెట్టారు. చివరకు వారు తమ వద్ద గాయత్రీ–1,2 నిర్వాహకులు రూ.4,200 నుంచి రూ.4,500 వరకూ (రెండున్నర యూనిట్లు) నెల రోజులపాటు వసూలు చేశారని ఫిర్యాదు చేయగా వదిలిపెట్టారు.
గాయత్రీ ర్యాంపుల్లో మూడు యూనిట్ల లారీలకు అనుమతి లేదు. అయినా నెల రోజుల నుంచీ ర్యాంపుల్లో ఇసుకను లోడింగ్ చేస్తూ రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం మిన్నకుండిపోవడం వెనుక మర్మమేమిటో తెలియాల్సి ఉంది. ప్రారంభంలో అక్రమాలు ఆపకుండా లారీలను ఆపడం వల్ల ఏం సాధించారో యంత్రంగానికే ఎరుక. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే కార్యాలయాల్లో కూర్చుని తాము ఇది చేస్తాం. అది చేస్తాం, అక్రమాలను ఆపుతామంటూ ఐఏఎస్ అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. తాజాగా జరుగుతున్న ఘటనలు ఉన్నతాధికారుల మాటలకు చేతలకు ఏ మాత్రం పొంతన లేకపోవడంతో విశ్వసనీయత తగ్గిపోతోంది.
జై భీమ్ సొసైటీని నిలిపివేశాం
గాయత్రీ ర్యాంపులో రెండున్నర యూనిట్లకు రూ.4,500 తీసుకున్నట్లు మా విచారణలోనూ తేలింది. ఇసుక విక్రయించిన జై భీమ్ సొసైటీని నిలిపివేసి విచారణ చేస్తున్నాం. నదీ పరిరక్షణ, ట్రాఫిక్ ఇబ్బందులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కుమారి టాకీస్, వాటర్ వర్క్స్ ర్యాంపులను డీఎస్‌ఎల్ సిఫార్సు మేరకు మూసివేశాం. అక్కడ పని చేస్తున్న వారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు కాబట్టి వారు ఎక్కడ నావలు ఉంటే ఉపాధి కోసం అక్కడకు వెళతారు. కోటి లింగాలఘాట్ ర్యాంపు నుంచి నగరంలోని అవసరాలకు మాత్రమే ఇసుక తరలిస్తున్నారు. ఇతరులకు ఇస్తే ఇతర జిల్లాల్లో విక్రయించే అవకాశం ఉంది. గోదావరిలో వరద తగ్గితే ర్యాంపులను తిరిగి ప్రారంభిస్తాం. గత ఏడాది ఇదే సమయంలో రెండు యూనిట్ల ధర రూ. 5 వేల నుంచి రూ.6 వేలు ఉంది. గత ఏడాది కన్నా ఇప్పుడే తక్కువ. – వి.విజయరామరాజు, ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్, రాజమహేంద్రవరం.