ఫైళ్లన్నీ ఈ– ఆఫీస్‌లోనే పంపాలి
Published Thu, Apr 13 2017 12:34 AM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM
– జెడ్పీ సీఈఓ బీఆర్ ఈశ్వర్
కర్నూలు(అర్బన్): జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల నుంచి ఫైళ్లన్ని ఈ – ఆఫీస్ సిస్టమ్‌లోనే పంపాలని జిల్లా పరిషత్ సీఈఓ బీఆర్ ఈశ్వర్ కోరారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జిల్లాలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాలకు చెందిన సూపరెంటెండెంట్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ ఈశ్వర్ మాట్లాడుతూ.. ఈ – ఆఫీస్ ద్వారా ఫైళ్లన్ని పంపేందుకు ప్రతి ఒక్కరూ అలవాటు పడాలని, అవసరమైన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు. రాబోయే రోజులన్నీ సాంకేతిక పరిజ్ఞానంతోనే ఆధారపడి ఉంటాయన్నారు.
జిల్లాలోని అన్ని గ్రామాల్లో బోర్ల పరిస్థితులపై ఎప్పడికప్పుడు సమీక్షిస్తుండాలని, బోర్ల మరమ్మతులకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేసేందుకు ఎలాంటి తాత్సారం చేయరాదన్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు ఇచ్చిన ప్రతిపాదనలపై వెంటనే పరిశీలించి తాగునీటి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ముఖ్యంగా 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలోనే అకౌంట్లన్ని పక్కాగా ఉంచుకోవాలన్నారు. ఎస్‌సీ ,ఎస్‌టీ కాలనీల్లో చేపట్టే పనులకు సంబంధించి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే పనులు చేపట్టి పూర్తి చేయాలన్నారు. వచ్చిన బడ్జెట్‌ను ఖర్చు చేయకుంటే కార్పొరేషన్‌కు తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ప్రతాపరెడ్డి, ఏఓ భాస్కర్‌నాయుడు, ఎంపీడీఓ కార్యాలయ సూపరెంటెండెంట్లు పాల్గొన్నారు.
Advertisement