వార్షిక వేడుకగా అమరావతి షాపింగ్ ఫెస్టివల్
వార్షిక వేడుకగా అమరావతి షాపింగ్ ఫెస్టివల్
Published Sun, Oct 2 2016 6:51 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
విజయవాడ : అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను ఇక నుంచి ఏటా అక్టోబర్, నవంబర్ మాసాల్లో వార్షిక వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ బాబు.ఎ ప్రకటించారు. ఆయన విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో అమరావతి ఫెస్టివల్ నిర్వహణపై ఆటోమొబైల్ అసోసియేషన్ ప్రతినిధులు, ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలను ఏటా దసరా, దీపావళి పండుగల మధ్యలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. తొలిసారిగా నగరంలో నిర్వహిస్తున్న అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను వచ్చే ఏడాది నుంచి ఈ ప్రాంతం మొత్తంలో నిర్వహిస్తామన్నారు. భవిష్యత్తులో ఇదే తరహా ఫెస్టివల్‌ను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఆటోమొబైల్ రంగంలో ఆసియాలోనే అతి పెద్దదిగా విజయవాడ ఆటోనగర్ పేరు పొందిందని, ఆటోమొబైల్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యేక డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు సరైన వేదికగా అమరావతి షాపింగ్ ఫెస్టివల్ నిలుస్తుందని చెప్పారు. ఇందుకోసం అసోసియేషన్ ప్రతినిధులు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. అనంతరం ఆస్పత్రుల ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడుతూ మెడికల్ హబ్‌గా విజయవాడ, అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఆవిష్కరించేందుకు సరైన వేదికగా ఈ ఫెస్టివల్ నిలుస్తుందన్నారు. ప్రపంచ స్థాయి పేరిన్నికగన్న వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని ప్రపంచానికి తెలిపేందుకు ఇది ఒక సదవకాశమని పేర్కొన్నారు. టూరిజం ఈడీ సి.మల్లికార్జునరావు, రాధా–మాధవ్ మోటార్స్, కుశలవ మోటార్స్, ఫ్యూజన్ మోటార్స్ సంస్థలు, రమేష్ హాస్పిటల్స్ హెల్ప్‌లైన్, ఆంధ్రా హాస్పిటల్ తదితర ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement