మాతోనే తెలంగాణ అభివృద్ధి | Amit Shah Targets TRS, Says BJP Alone Can Develop Telangana | Sakshi
Sakshi News home page

మాతోనే తెలంగాణ అభివృద్ధి

Published Sat, Jun 11 2016 9:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మాతోనే తెలంగాణ అభివృద్ధి - Sakshi

మాతోనే తెలంగాణ అభివృద్ధి

కుటుంబ పార్టీలతో రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందవు
సూర్యాపేట బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం గత రెండేళ్లలో రూ.90 వేల కోట్ల కన్నా ఎక్కువ నిధులిచ్చింది. కానీ కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయి క్షేత్రస్థాయికి చేరడం లేదు. కుటుంబ పార్టీలతో తెలంగాణకు, దేశానికి మేలు జరగదు. తెలంగాణ సమగ్రాభివృద్ధి ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీతోనే సాధ్యం’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉద్ఘాటించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. గత రెండేళ్లుగా మోదీ ప్రభుత్వం అవినీతి లేని పాలన అందిస్తోందని అన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు వస్తాయని, పార్టీ పటిష్టత కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జరిగిన ‘అభివృద్ధి పథంలో భారత్’ పేరిట నిర్వహించిన బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే...

 దేశానికి మాట్లాడే ప్రధానిని ఇచ్చాం..
తెలంగాణ ఏర్పాటై రెండేళ్లవుతున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటై మే 26 నాటికి రెండేళ్లయింది. ఈ రెండేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం దేశానికి ఏమిచ్చిందని కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ప్రశ్నిస్తున్నారు. సోనియాజీ.. మీకు వినగలిగే శక్తి ఉంటే వినండి. ఏం ఇచ్చినా ఇవ్వకున్నా ఈ దేశానికి ఓ మాట్లాడే ప్రధానిని ఇచ్చిన ఘనత మాది. పదేళ్ల యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మాట్లాడే మాటలు కేవలం సోనియాకు, ఆమె కుమారుడికి మాత్రమే వినిపించేవి. వారికి తప్ప ఇంకెవరికీ వినపడేవి కావు. కానీ ఇప్పటి ప్రధాని మాటలను ప్రపంచం వింటోంది.

ఈ రెండేళ్లలో మేం అవినీతి లేని పాలననిచ్చాం. మీరు(యూపీఏ) అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, స్కాంలు జరగని ప్రదేశం ఉందా? అంతరిక్షంలో 2జీ, ఆకాశంలో వెస్ట్‌ల్యాండ్, భూమిపై ఆదర్శ సొసైటీ, కామన్వెల్త్, సముద్రంలో సబ్‌మెరైన్, పాతాళాన్ని కూడా వదలకుండా బొగ్గు స్కాం.. ఇలా ఈ విశ్వంలో ఏ స్థానాన్ని వదలకుండా కుంభకోణాలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. అలాగే రెండేళ్ల క్రితం దేశ సరిహద్దుల్లో కాల్పులు పాకిస్తాన్ ప్రారంభించి పాకిస్తానే ముగించేది. కానీ ఇప్పుడు కాల్పులు పాకిస్తాన్ ప్రారంభిస్తే భారత్ ముగిస్తోంది. ఇటలీ కళ్లద్దాలు పెట్టుకున్న రాహుల్ బాబాకు ఈ విషయం కనబడదు.

 మన్మోహన్ విదేశాలకు వెళ్తే ఎవరికీ తెలిసేది కాదు
ఈ రెండేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యలెన్నో తీసుకున్నాం. దేశ ఆర్థికాభివృద్ధి 7.6 శాతంతో ముందుకెళుతోంది. ప్రపంచంలో ఏ దేశానికి రానన్ని పెట్టుబడులను తీసుకురాగలిగాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్‌కు తీసుకురాగలిగాం. ఉపాధి కల్పన కోసం స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియా పథకాలు తెచ్చాం. దేశంలోని 3.84 కోట్ల మందికి రూ.లక్ష రూపాయల రుణాన్ని అందజేశాం. జనధన్ యోజనతో 22 కోట్ల కుటుంబాలకు బ్యాంక్ అకౌంట్లిచ్చాం. రూ.12, రూ.300లతో ప్రమాద, జీవిత బీమా అందజేశాం. మోదీ విదేశాల చుట్టూ తిరుగుతున్నారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కానీ మోదీ కన్నా మన్మోహనే ఎక్కువసార్లు విదేశాలకు వెళ్లారు.

అయితే అప్పుడు ప్రధానిగా ఉన్న మౌనీబాబా ఎప్పుడు విదేశాలకు వెళ్లినా సామాన్యులకు తెలిసేది కాదు. కాగితాల్లో రాసిచ్చిన ఇంగ్లిష్ చదివి వచ్చేసేవారు. ఒక దేశంలో మాట్లాడాల్సింది మరో దేశంలో మాట్లాడిన సంద ర్భాలు కూడా చూశాం. కానీ మోదీ ఏ దేశానికి వెళ్లినా వేలాది మంది స్వాగతం పలుకుతున్నారు. ఇటీవల అమెరికా చట్టసభలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆయన ప్రసంగానికి హర్షధ్వానాలు, గౌరవం లభించాయి. అది మోదీకి వచ్చిందో, బీజేపీకి వచ్చిందో కాదు. ఇది తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు లభించిన గౌరవం.

 2019లో తెలంగాణలో మాదే అధికారం: కె.లక్ష్మణ్
తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. టీడీపీ నేతలు వలసబాట పట్టడంతో ఆ పార్టీ ఖాళీ అయిపోతోందని, ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల గొంతుకగా బీజేపీ ఉంటుందని, నిజమైన ప్రతిపక్షంగా పనిచేస్తుందని చెప్పారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదన్నారు. మజ్లిస్ ఒత్తిళ్లకు తలొగ్గి సెప్టెంబర్-17న తెలంగాణ విమోచన దినోత్సవాలను కేసీఆర్ అధికారికంగా జరపడం లేదన్నారు.

ఈసారి జరపకపోతే బీజేపీ ఆధ్వర్యంలోనే గ్రామగ్రామాన పెద్దఎత్తున విమోచన ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. అసెంబ్లీలోని బీజేపీ తరఫు ఐదుగురు ఎమ్మెల్యేలు ధర్మం కోసం పనిచేస్తారని చెప్పారు. రజకార్లను నిలువరించిన నల్లగొండ గడ్డ స్ఫూర్తితో మరో పోరాటానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. సభలో కేంద్రమంత్రి హన్స్‌రాజ్ అహిర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, శాసనసభా పక్ష నేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర రావు, యువమోర్చా జాతీయ మాజీ అధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మతతత్వ మజ్లిస్‌కు సమాధానం చెప్పగలదా?
రజాకార్లకు ఎదురొడ్డి నిలిచిన గడ్డ ఇది. ఈ గడ్డపై నేను అడుగుతున్నా. ఓవైసీల నాయకత్వంలోని మతతత్వ మజ్లిస్ పార్టీకి అధికార టీఆర్‌ఎస్ దీటైన సమాధానం చెప్పగలదా? లేదు. అది కేవలం బీజేపీకే సాధ్యం. కొత్తగా ఆవిర్భవించిన ఈ రాష్ట్రానికి అభివృద్ధి కావాలి. తెలంగాణ సంస్కృతికి పట్టం కట్టాలి. అందుకు తెలంగాణను బీజేపీకి సొంతిల్లుగా చేయాలి. బీజేపీకి మద్దతివ్వండి. పార్టీని గ్రామగ్రామానికి తీసుకెళ్లండి.

తెలంగాణకు ఇవన్నీ వచ్చాయా?
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ అభివృద్ధి కోసం రూ.90 వేల కోట్లు ఇచ్చాం. దేశంలోనే అన్ని రాష్ట్రాలకన్నా ఎక్కువ నిధులిచ్చాం. దేనికెన్ని ఇచ్చారని ఎవరైనా అడిగినా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చూడాలని నేను కోరుకుంటున్నా. కుటుంబ పార్టీల వల్ల తెలంగాణలో కానీ, దేశంలోని కానీ అభివృద్ధి జరగదన్న వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలి. తెలంగాణలోని ప్రతి గ్రామంలో 24 గంటల విద్యుత్, రోడ్ల నిర్మాణం, హాస్పిటళ్ల ఏర్పాటు, ప్రతి ఎకరానికి నీరు, ఉద్యోగాలు వచ్చాయా? అదే బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇవన్నీ అప్పుడే జరిగిపోయాయి. ఈ రాష్ట్రాన్ని పాలించిన వాళ్లు ఈ జిల్లా ప్రజలకు కనీసం ఫ్లోరైడ్ రహిత నీటిని అందించారా? 35 ఏళ్లకే తెల్లజుట్టుతో ఉన్న యువకులను చూస్తుంటే నా హృదయం జ్వలించిపోతోంది. కేంద్రం పంపే నిధులన్నీ మీకు క్షేత్రస్థాయి వరకు చేరడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement