‘కోటి’ దండాలు
-
అమలాపురం కన్యకా పరమేశ్వరి ఆలయంలో కరెన్సీ నోట్ల కళాకృతులు
-
కోటి రూపాయలకు పైగా నోట్లతో అమ్మవారితోపాటు ఆలయానికి సోయగం
అమలాపురం టౌన్ :
అమ్మవారిని పూలు, ఫలాలు, పలు పత్ర దళాలతో అలంకరించడం సంప్రదాయం. అక్కడక్కడా కరెన్సీ నోట్ల తోరణాలతో ముస్తాబు చేస్తారు. కానీ అమలాపురంలో వాసవీ కన్యకాపరమేశ్వరినే కాకుండా ఆలయాన్ని కూడా దసరా మహోత్సవాల్లో భాగంగా రూ.1.53 కోట్ల కరెన్సీ నోట్లతో ముంచెత్తారు. అమ్మవారి అంతరాలయం, మండపం గోడలకు రూ.1000, రూ.500 నోట్లతో, ఇక రూ.100, రూ.50, రూ.20, రూ.10, రూ.5 నోట్లతో పుష్పాలు, దండలు, తోరణాలుగా మలిచి కనువిందు చేశారు. ఆలయం మెుత్తం ఓ కరెన్సీ ఖాజానాగా సాక్షాత్కరించింది. పోలీసుల బందోబస్తు నడుమ ఈ అలంకరణ సాగింది. దీన్ని తిలకించడానికి శుక్రవారం ఉదయం నుంచి రాత్రి దాకా కరెన్సీ కన్యకాపరమేశ్వరి దేవిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉప ముఖ్యమంత్రి రాజప్ప, హైకోర్టు న్యాయమూర్తి ఎంఎస్‌ఆర్ మూర్తి, ఎమ్మెల్యే ఆనందరావు, ఆర్డీవో జి.గణేష్‌కుమార్, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మిండగుదటి మోహన్, చెల్లుబోయిన శ్రీనివాస్ తదితరులు సందర్శించారు.