వైష్ణవ ప్రతిపాదిత తొలి గ్రంథం ఆముక్తమాల్యద | amuktha malyadha grandham | Sakshi
Sakshi News home page

వైష్ణవ ప్రతిపాదిత తొలి గ్రంథం ఆముక్తమాల్యద

Published Fri, Nov 18 2016 9:15 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

amuktha malyadha grandham

  • ఘనంగా ప్రారంభమైన భువనవిజయ సాహితీప్రసంగాలు
  • రాజమహేంద్రవరం కల్చరల్‌ :
    శ్రీవైష్ణవ ప్రతిపాదితమైన తొలి గ్రంథం ఆముక్తమాల్యదగా భావించాలని రాష్ట్రపతి అవార్డుగ్రహీత చింతలపాటి శర్మ పేర్కొన్నారు. నన్నయ వాజ్ఞ్మయ వేదిక, పద్యసారస్వత పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో భువనవిజయ సాహితీ ప్రసంగాలు శుక్రవారం ఆదిత్య డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యవక్తగా పాల్గొన్న చింతలపాటి శర్మ మాట్లాడుతూ విష్ణుపరమైన భక్తికథలు ఆముక్తమాల్యదలో ప్రధానంగా చూడవచ్చన్నారు. తిరుపతి వేంకన్నకు అంకితమిచ్చిన ఆముక్తమాల్యదలో విష్ణుచిత్తుని కథ ప్రధానమైనదని అన్నారు. నేటి ప్రజాస్వామ్యలక్షణాలకు రాయలకాలంలోనే బీజాలు పడ్డాయి‡, వైష్ణవ మతస్తుడైన రాయలు కొలువులోని మాదయగారి మల్లన, ధూర్జటి వంటి పరమశివభక్తులు సత్కారాలను అందుకున్నారని శర్మ అన్నారు. క్లిష్టాన్వయాలతో కూడిన పద్యాలను రాయలు రచించారని తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలుకు తెలుగు, కన్నడం, తులు, తమిళం, కొంకణి, ఒరియా, ద్రావిడ భాషలతో విస్తృతమైన పరిచయం ఉన్నా తెలుగుభాషలోనే ఆముక్తమాల్యద రచించారన్నారు.ఆముక్తమాల్యదలో రాయలు ఉపయోగించిన పదాలు కొన్ని నేడు లేవు, పాతనీరు కొట్టుకుపోయి, కొత్తనీరు రావడం ఎంతసహజమో, కాలప్రవాహంలో పాతమాటలు పోయి, కొత్తమాటలు రావడం అంతే సహజమని ఆయన అన్నారు. మరుగున పడుతున్న ప్రాచీన గ్రంథాలను నేటి తరానికి గుర్తుచేయడానికి, వాటి మాధుర్యాన్ని నేటి తరానికి అందించడానికి చేస్తున్న చిరుప్రయోగం భువన విజయసాహితీ ప్రసంగాలని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్‌ ఎంఆర్‌వీ శర్మ మాట్లాడుతూ కృష్ణదేవరాయల కాలంనాటి మహాకవుల వాగమృతం పదిరోజులపాటు వర్షిస్తూనే ఉంటుందన్నారు. నగరమేయర్‌ పంతం రజనీశేషసాయి జ్యోతిప్రజ్వలన చేశారు. డాక్టర్‌ ఎస్‌వీ రాఘవేంద్రరావు అతిథులను, ముఖ్యవక్తను పద్యరూపకంలో వేదికపైకి ఆశీర్వదించడం విశేషం. నన్నయ వాజ్ఞ్మయ వేదిక ఉపాధ్యక్షుడు ఎస్‌.పి గంగిరెడ్డి సభను ప్రారంభించారు. నిత్యవిద్యార్థి డాక్టర్‌ కర్రి రామారెడ్డి , మహామహోపాధ్యాయ డాక్టర్‌ కొంపెల్ల సత్యనారాయణ శాస్త్రి ప్రసంగించారు. జోస్యులరామచంద్ర శర్మ వందన సమర్పణ చేసారు. సాహిత్యాభిమానులు హాజరయ్యారు.
    నేడు వసుచరిత్రపై అబ్బిరెడ్డి ప్రసంగం
    భువన విజయ సాహితీప్రసంగాలలో భాగంగా, శనివారం ఉదయం 10 గంటలకు ఎస్‌.కె.వి.టి. డిగ్రీ కళాశాల ఆంధ్రోపన్యాసకుడు డాక్టర్‌ అబ్బిరెడ్డి పేర్యనాయుడు ’వసుచరిత్ర–వాగ్దేవీహృదయాలు’ అనే అంశంపై ప్రసంగిస్తారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement