ఓ ఐపీఎస్.. ఓ‘థ్రిల్లర్’
నేత్రదాన ంపై పోలీసు అధికారి పాడిన పాప్ గీతం
ఎస్పీ ఆకే రవికృష్ణ స్వీయ రచన, గానం
సోషల్ మీడియాలో హల్‌చల్
ఆయనో ఐపీఎస్ అధికారి. ఓ జిల్లాకు పోలీస్ బాస్. కాఠిన్యంతోనే కాదు కారుణ్యంతోనూ సమాజంలో మార్పు తీసుకురావాలని భావించారు. అంధుల జీవితాల్లో చీకట్లను పారదోలాలని అనుకున్నారు. అందుకు నేత్రదానం ఒక్కటే మార్గమనుకున్నారు. అంతే ‘నేత్రదానం’పై ‘థ్రిల్లర్’ పేరుతో ఓ గీతానికి స్వీయ రచన చేసి ఆయనే గానం చేశారు. యువతను ఆకట్టుకునేలా.. ప్రజలు ఒక్క నిమిషం ఆలోచించేలా పాటను చిత్రీకరించారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఆ ఐపీఎస్ మనకూ సుపరిచితుడే. ఆయనే ఆకే రవికృష్ణ. శాంతిభధ్రతలతో పాటు సమాజ శ్రేయస్సునూ భుజాలకెత్తుకున్నారాయన. గుంటూరు జిల్లాలో సైతం సామాజిక స్పృహ కలిగిన ఎన్నో అంశాలపై ఆయన స్పందించిన వైనం ప్రశంసనీయం.
4.15 నిమిషాల నిడివితో..
షార్ట్‌ఫిల్మ్ తరహాలో నలుగురు యువకులు స్టెప్పులేస్తుండగా, ఎస్పీ పాప్ గీతం తరహాలో పాట పాడారు. 4.15 నిమిషాల నిడివితో ఈ పాటను ఎస్పీ మ్యూజిక్ స్టూడియోలో పాడుతుండగా చిత్రీకరించారు. నేత్రదానంపై యువతను మేల్కొలిపేలా ఉన్న ఈ పాట ప్రస్తుతం ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ పాటను విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు అంకితం చేశారాయన.
- ప్రత్తిపాడు