అంగన్‌వాడీల ఆకలి కేకలు
అంగన్‌వాడీల ఆకలి కేకలు
Published Fri, Dec 23 2016 11:09 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
పండగ వేళా పస్తులే
మూడు నెలలుగా అందని జీతాలు
గుబులు పుట్టిస్తున్న అంగన్ వాడీ కేంద్రాల విలీనం
కొవ్వూరు :
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆకలి కేకలు పెడుతున్నారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత సొంత జిల్లాలోనూ మూడు నెలలుగా జీతాలు అందక వారంతా అలమటిస్తున్నారు. క్రిస్మస్, సంక్రాంతి పండగ రోజుల్లోనూ వేతనాలు అందకపోవడంతో పండగకు దూరమయ్యే దుస్థితి దాపురించింది. పండగ నాడు పిండి వంటలు చేయాలన్నా, పిల్లలకు కొత్త దుస్తులు కొనాలన్నా డబ్బుల్లేక అవస్థలు పడుతున్నారు. బడ్జెట్ విడుదలైతే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు చేతులెత్తేయడంతో పండగ రోజుల్లోనూ పస్తులు ఉండక తప్పడం లేదని వాపోతున్నారు. జిల్లాలోని 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3,889 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 332 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు. అన్ని కేంద్రాల్లో కలిపి 3,557 మంది కార్యకర్తలు, 3,889 ఆయాలు పనిచేస్తున్నారు.
9 నెలలుగా ఇదే పరిస్థితి
ఒక్కో కార్యకర్తకు గతంలో రూ.4,200 చెల్లించేవారు. ఆయాకు రూ.2,200 ఇచ్చేవారు. ఏప్రిల్ నుంచి కార్యకర్తలకు రూ.7వేలు, ఆయాలకు రూ.4,500 చొప్పున చెల్లిస్తున్నారు. 9 నెలలుగా వీరికి సకాలంలో జీతాలు అందటం లేదు. ఏప్రిల్, మే, జూన్ నెలల జీతాల బకాయిలను జూలై చివరిలో ఇచ్చారు. జూలై, ఆగస్ట్ నెలలకు సంబంధించి సెప్టెంబర్‌లో, సెప్టెంబర్ జీతాలను అక్టోబర్‌లో చెల్లించారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల జీతాల బడ్జెట్ ఇప్పటివరకు విడుదల కాలేదు. మూడు నెలలకు రూ.9.22 కోట్లు చెల్లించాల్సి ఉంది.
వెంటాడుతున్న విలీన భయం
ఒకవైపు జీతాల ఽఅందక అంగన్‌వాడీలు అవస్థలు పడుతుంటే.. ఈ కేంద్రాలను విలీనం చేసే అంశం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఒకే గ్రామం, ఒకే ప్రాంతంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ అంగన్‌వాడీ కేంద్రాలుంటే విలీనం చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటికే కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా విలీనం చేసినా సత్ఫలితాలు రాలేదు. పైగా ప్రీ స్కూల్‌కు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఈ తరుణంలో అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేస్తే మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విలీనానికి సంబంధించి అధికారులు వివరాలు సేకరిస్తుండటంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల్లో ఉద్యోగ భద్రతపై ఆందోళన నెలకొంది.
బడ్జెట్ విడుదల కావాలి
జిల్లాకు జీతాల బడ్జెట్ విడుదల కాలేదు. అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతాయి. బడ్జెట్ విడుదల కాగానే చెల్లింపులకు చర్యలు తీసుకుంటాం.
విద్యావతి, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి
ఆర్ధిక ఇబ్బందులతో నలిగిపోతున్నాం
మూడు నెలల నుంచి జీతాలందక ఆర్థికంగా నలిగిపోతున్నాం. కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. ప్రతిసారి ఇదే పరిఽస్థితి. పండగ సమయంలోనూ జీతాలు సకాలంలో ఇవ్వకపోవడం ఇబ్బందిగా ఉంటుంది.
ఎస్‌కే జియా ప్రకాష్, అధ్యక్షురాలు, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
ప్రతినెలా చెల్లించాలి
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు ఏ నెలకు ఆ నెల జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జీతాల విషయంలో తొమ్మిది నెలలుగా ఇదే తరహాలో ఇబ్బందులు పడుతున్నాం. ప్రతిసారి బడ్జెట్‌తో ముడిపెట్టడం వల్ల అవస్థలు తప్పడం లేదు.
పి.భారతి, ప్రధాన కార్యదర్శి, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్
Advertisement
Advertisement