పోస్టర్లు ఆవిష్కరిస్తున్న టీటీడీచైర్మన్‌చదలవాడ కృష్ణమూర్తి
– భారీ విగ్రహ నిర్మాణానికి టీటీడీ తీర్మానం
–వరలక్ష్మి వ్రతం పోస్టర్ల ఆవిష్కరణ
–పుష్కరాల ప్రాముఖ్యతపై ఎస్వీబీసీలో ప్రోమో
సాక్షి, తిరుమల: రామచంద్రాపురం మండలం రాయలచెరువు గుట్టపై ఆంజనేయుడు కొలువుదీరనున్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు టీటీడీ బోర్డు సిద్ధమైంది. మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్ అతిథిగృహంలో జరిగిన బోర్డు సమావేశంలో దీనిపై తీర్మానం చేశారు. దాదాపు రూ.32 లక్షల ఖర్చుతో 46 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించనున్నారు. దీనివల్ల శ్రీవారి దర్శనానికి వచ్చే పాదచారులతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో భక్తి భావం పెంపొందించే అవకాశం ఉంటుందని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తెలిపారు.
వరలక్ష్మి వత్రం పోస్టర్ల అవిష్కరణ
తిరుచానూరు పద్మావతి అమ్మవారి వరలక్ష్మి వ్రతం ఈ నెల 12వ తేదీన జరగనుంది. ఈ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్లను మంగళవారం టీటీడీ చైర్మన్, ఈవో, బోర్డు సభ్యులు, తిరుచానూరు ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆవిష్కరించారు. శ్రావణ మాసంలో అమ్మవారి వరలక్ష్మి వ్రతం ఆగస్టు 12న శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో జరుగుతుందని చైర్మన్, ఈవో వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు బంగారు రథంపై అమ్మవారి ఊరేగింపు ఉంటుందని తెలిపారు. కష్ణాపుష్కరాల్లో సేవలందించనున్న టీటీడీ సిబ్బందికి భారత్ బయోటెక్ రూపొందించిన టైఫాయిడ్ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
పుష్కరాల ప్రాముఖ్యతపై ఎస్వీబీసీలో ప్రోమో
కృష్ణా పుష్కరాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎస్వీబీసీ తయారు చేసిన ప్రోమోను టీటీడీ చైర్మన్, ఈవో, బోర్డు సభ్యులు ప్రారంభించారు. ఐదున్నర నిమిషాల నిడివి గల ఈ ప్రోమోలో కృష్ణానది ప్రాముఖ్యత, సంపద, వివిధ నదులు, వివిధ కళలకు చెందిన ప్రముఖులు, రచయితలు, వాగ్గేయకారులు, సినీ పరిశ్రమ, తదితర రంగాల ప్రాముఖ్యతను తెలియజేసే అంశాలు ఉన్నాయి.. ప్రముఖ దర్శకులు, టీటీడీ బోర్డు సభ్యుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఈ ప్రోమోను చిత్రీకరించారు. పుష్కరాలు పూర్తయ్యేవరకు ఈ ప్రోమో ఎస్వీబీసీలో ప్రసారం కానుంది.