అన్నకు మసక.. చెల్లెళ్లకు మస్కా | annaku masaka.. chellellaku maska | Sakshi
Sakshi News home page

అన్నకు మసక.. చెల్లెళ్లకు మస్కా

Published Fri, Nov 25 2016 2:51 AM | Last Updated on Tue, Oct 16 2018 3:26 PM

అన్నకు మసక.. చెల్లెళ్లకు మస్కా - Sakshi

అన్నకు మసక.. చెల్లెళ్లకు మస్కా

పేదలకు చౌక ధరలకు ఔషధాలు అందించేందుకు నెలకొల్పిన అన్నసంజీవని పథకం నిర్వహణ గాడి తప్పింది. జిల్లావ్యాప్తంగా 37 దుకాణాలను ఏర్పాటు చేసిన అధికారులు అరకొరగానే ఔషధాలను సరఫరా చేస్తున్నారు. అమ్మకాలు పడిపోవడంతో ఐకేపీ సిబ్బందికి, డ్వాక్రా మహిళలకు టార్గెట్లు పెడుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఆచంట : పేదలకు చౌక ధరలకే ఔషధాలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నసంజీవని దుకాణాలు డ్వాక్రా మహిళల పాలిట శాపంగా మారాయి. ఒక పక్క పెద్ద నోట్ల రద్దుతో చిల్లరనోట్ల కోసం నానాఇబ్బం దులు పడుతుంటే.. మరోపక్క మందులు కొనాల్సిందేనంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారు. అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచి అమ్మకాలు పెంచుకోవాల్సిందిపోయి అడ్డదారుల్లో 
అమ్మకాలకు ప్రభుత్వం వెంపర్లాడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
 
జిల్లాలో 38 దుకాణాల ఏర్పాటు
జిల్లాలోని పట్టణాలు, వివిధ మండలాల్లో మొత్తం 38 అన్న సంజీవని దుకాణాలు ఏర్పాటు చేశారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రులు, నరసాపురం, భీమవరం, నిడదవోలులోని ప్రభుత్వాసుపత్రులు, పీహెచ్‌సీలతోపాటు ఆచంట, పోలవరం, బుట్టాయగూడెం తదితర మండలాల్లో ఈ దుకాణాలు ఏర్పాట య్యాయి. వీటి నిర్వహణ బాధ్యతను ఐకేపీ అధికారులకు అప్పగించారు. షాపుల నిర్వహణ మొక్కుబడిగా సాగడం.. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో అమ్మకాలు పడిపోయాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అధికారులు అది విస్మరించి డ్వాక్రా సంఘాలకు మందులు అంటగడుతున్నారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన దుకాణాల్లో నెలకు రూ.2 లక్షల వరకూ అమ్మకాలు సాగించాలంటూ ఐకేపీ సిబ్బందికి లక్ష్యాలు విధించారు. ఏం చేయాలో పాలుపోని ఐకేపీ సిబ్బంది మందులు కొనుగోలు చేయాలంటూ గ్రామాల్లోని డ్వాక్రా సంఘాలపై ఒత్తిడి పెంచుతున్నారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులు రోగం లేకున్నా మందులు కొనాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. 
 
ఔషధాలు కొంటేనే రుణం
ఒక్కో డ్వాక్రా సంఘంలో కనీసం పది మందికి తగ్గకుండా సభ్యులు ఉంటారు. ఒక్కొక్కరూ ప్రతి నెలా రూ.200 విలువైన మందులు కొనుగోలు చేయాలని ఐకేపీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అంటే ఒక్కో గ్రూపులో పదిమంది సభ్యులు ఉంటే కనీసం రూ.2 వేల విలువైన మందులు కొనుగోలు చేయాలి. ఈ విధంగా రోజుకు ఒకటి లేదా రెండు గ్రూపుల చేత మందులు కొనుగోలు చేయిస్తూ కొంతకాలంగా టార్గెట్లు చేరుకుంటున్నారు. మందులు కొంటున్నారో లేదో తెలసుకునేందుకు మరో మెలిక పెడుతున్నారు. మందులు కొన్నట్టు సంబంధిత దుకాణం నుంచి రశీదులు తెచ్చి కార్యాలయాల్లో చూపించాలని షరతు పెడుతున్నారు.  ఈ విధమైన బలవంతపు కొనుగోళ్ల వ్యవహారం జిల్లాలోని అన్ని మండలాల్లో చడీచప్పుడు కాకుండా కొంతకాలం నుంచి సాగిపోతోంది. ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే.. పైఅధికారులు నెలవారీ టార్గెట్లు పెడుతున్నారని నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు. 
 
సబ్బులు.. పేస్టులు.. టానిక్‌లూ
అధికారుల ఒత్తిడితో ఔషధ దుకాణం వద్దకు వెళుతున్న డ్వాక్రా సంఘాల మహిళలకు దిక్కుతోచడం లేదు. రోగం లేకుండా ఏం మందులు కొనాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణానికి వెళ్లి తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని చెబితే.. మీకోసం ప్రత్యేకంగా మెడికేటెడ్‌ టూత్‌పేస్టులు, సబ్బులు, బలానికి టానిక్‌లు, మల్టీవిటమి¯ŒS టాబ్లెట్లు అందుబాటులో ఉంచామంటూ రూ.200కు సరిపడా సరుకులు అంటగడుతున్నారని మహిళలు వాపోతున్నారు. ఈ వ్యవహారాన్ని ఎవరికైనా చెప్పుకుంటే వారికి రుణం నఇవ్వరేమోన భయపడిపోతున్నారు. ఒక పక్క డ్వాక్రా సంఘాలకు ఆర్థిక పరిపుష్టినిచ్చి వారి కాళ్లమీద వారిని నిలబెడతామని చెబుతున్న పాలకులు.. ప్రభుత్వ పథకాన్ని మనుగడలో ఉంచడం కోసం చిరుద్యోగుల చేతి చమురు వదిలిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బలవంతపు కొనుగోళ్ల వ్యవహారానికి స్వస్తి చెప్పాలని డ్వాక్రా మహిళలు జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశంపై సంబంధిత శాఖ ఉన్నతాధికారిని ‘సాక్షి’ సంప్రదించగా టార్గెట్లు నిర్ణయించడం నిజమేననిన చెబుతూ.. తన పేరు మాత్రం రాయవద్దని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement