మహిళల రక్షణకు మరో ముందడుగు
► ఎస్పీ ఎం.శ్రీనివాస్
► షీటీమ్ సభ్యులకు వాహనాలు అందజేత
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో మహిళల సంరక్షణకు మరో ముందుడుగు వేశామని ఎస్పీ శ్రీనివాస్ అన్నారు. గురువారం పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో నూతన షీటీమ్ బృందాల పరిచయ వేదికలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మూడు షీటీమ్ బృందాల సభ్యులకు నూతన వాహనాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల ధన, మాన, ప్రాణాలకు, గౌరవ అభిమానాలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించి పటిష్టంగా మార్చిందని అన్నారు. ఇందులో భాగంగానే షీటీమ్ సభ్యులకు 15 నూతన వాహనాలు కేటాయించామని తెలిపారు.
మహిళలపై అఘాయిత్యాలను రహస్య కెమెరాలో చిత్రీకరించి, రుజువులతో సహా వారిని పట్టుకుని తల్లిదండ్రులు, భార్య, బంధువుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పించడంతోపాటు పోకిరీలపై కేసులు నమోదు చేస్తామన్నారు. 100కు డయల్ చేస్తే సత్వరమే షీటీమ్ సభ్యులు చేరుకుంటారని తెలిపారు. కళాశాలల్లో విద్యార్థిగా వెళ్లి అనుమానితులపై నిఘా ఉంచుతారని, విద్యార్థులు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవదని అన్నారు. సీసీఎస్ డీఎస్పీ కె.నర్సింహారెడ్డి పర్యవేక్షణలో షీటీమ్‌లు పని చేస్తాయని, సభ్యులు మారువేషంలో ఉండి మహిళలకు రక్షణ కల్పిస్తారని తెలిపారు. సెల్ 8333986698 ద్వారా సమాచారం అందించి పోలీసు రక్షణతోపాటు ప్రజారక్షణ చర్యలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ డీఎస్పీ లక్ష్మి నారాయణ, సీసీఎస్ డీఎస్పీ నర్సింహారెడ్డి, పట్టణ సీఐ సత్యనారాయణ, ఆర్‌ఐ బి.జెమ్స్, ఎస్సైలు డి.పద్మ, రాజలింగం, ఆర్‌ఎస్సై పెద్దయ్య, ఏఎస్సై అప్పారావు, శంకర్, రాధ, రాంమూర్తి, సర్దార్ సింగ్, లక్ష్మి, సుశీల, సరిత, మౌనిక పాల్గొన్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
ఆదిలాబాద్ రిమ్స్ : నేరాల నియంత్రణకు పట్టణంలోని కాలనీల్లో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ ఎం.శ్రీనివాస్ సూచించారు. ఇందుకోసం పోలీసు అధికారులు చొరవచూపాలని పేర్కొన్నారు. గురువారం మహిళా పోలీసు స్టేషన్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు లక్ష్మీనారాయణ, నర్సింహారెడ్డి, ఆర్‌ఐ బి.జేమ్స్, ఆర్‌ఎస్సై బి.పెద్దయ్య, ఎస్సై రాజలింగం, డి.పద్మ పాల్గొన్నారు.