ర్యాగింగ్ భూతాన్ని తరిమివేద్దాం
– చైతన్యానికి శ్రీకారం చుట్టిన వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం
– యాంటీ ర్యాగింగ్ పోస్టర్ విడుదల చేసిన గౌరు వెంకటరెడ్డి
కర్నూలు (ఓల్డ్‌సిటీ):
ర్యాగింగ్ భూతాన్ని తరిమివేద్దామని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విద్యార్థి విభాగం నాయకులతో కలిసి యాంటీ ర్యాగింగ్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్ అనేది విద్యార్థి పాలిట యమపాశం లాంటిదన్నారు. నూతనంగా కాలేజీల్లో చేరే విద్యార్థుల పట్ల సీనియర్లు అసభ్యంగా ప్రవర్తించడంతో మనో వేదనకు గురై చివరికు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఇలాంటి దురాచారాన్ని రూపుమాపాలని పిలుపునిచ్చారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రై వేటు, ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులను చైతన్యపరిచే కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ర్యాగింగ్ నష్టాలను వివరించి, విద్యార్థుల మధ్య స్నేహ పూర్వక వాతావరణం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు టి.అనిల్ కుమార్, నగర అధ్యక్షుడు పి.జి. గోపినాథ్ యాదవ్, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, సతీశ్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, సంజు, అశోక్, ప్రత్యూష్, సురేంద్ర, రాజు, కొండ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.