పుష్కరునికి పునఃస్వాగతం | antya pushkarams start | Sakshi
Sakshi News home page

పుష్కరునికి పునఃస్వాగతం

Published Mon, Aug 1 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

పుష్కరునికి పునఃస్వాగతం

పుష్కరునికి పునఃస్వాగతం

సాక్షి ప్రతినిధి, ఏలూరు : అంత్య పుష్కర సంరంభం ఆరంభమైంది. గోదావరి తీరాన భక్తిభావం ఉప్పొంగింది. ఆదివారం ఉదయం 8.25 గంటలకు అంత్యపుష్కరాలు ప్రారంభమవుతాయని తొలుత ప్రచారం జరగడంతో ఉదయం ఏడు గంటలవరకూ కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో భక్తుల జాడ అంతంతమాత్రంగానే కనిపించింది. ఈ సమయంలో ఘాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ జనం లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఉదయం తొమ్మిది గంటల తర్వాత భక్తుల రద్దీ పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచీ యాత్రికులు తరలివచ్చారు.  తొలిరోజు పుష్కరఘాట్లను మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీలు మాగంటి మురళీమోహన్, గోకరాజు గంగరాజు, స్థానిక ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. 
ఘాట్లలో ఇదీ పరిస్థితి..
అధికారులు నిర్ణయించిన ప్రధాన ఘాట్లలోనే కాకుండా మిగిలిన ఘాట్లలోనూ భక్తులు స్నానాలకు ఆసక్తికనబరిచారు.  పెరవలి మండలం తీపర్రు, ముక్కామల, ఉమ్మిడివారిపాలెం, కాకరపర్రు, ఉసులుమర్రు, కానూరు అగ్రహారం, మల్లేశ్వరం, ఖండవల్లి ఘాట్‌లలో పుణ్యస్నానాలు ఆచరించారు. యలమంచలి మండలంలో ఆరు పుష్కరఘాట్‌లు ఉండగా.. ఒక్క లక్ష్మీపాలెం, దొడ్డిపట్ల ఘాట్లకు మాత్రమే భక్తులు చెప్పుకోదగ్గ స్థాయిలో వచ్చారు.  సిద్ధాంతంలో పెనుగొండ వాసవీ కన్యకాపరమేశ్వరి పీఠాధిపతి కృష్ణానంద పురిస్వామిజీ అంత్యపుష్కరాలను ప్రారంభించారు. గోదావరిమాతకు పూజలు చేసి, పుష్కర స్నానం వల్ల కలిగే ఫలాలను భక్తులకు వివరించారు. కేదారీ ఘాట్‌లోని మూడు పుష్కర రేవులు భక్తులతో కిటకిటలాడాయి. వృద్ధులకు, వికలాంగులకు జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. ఆచంట మండలంలోని కరుగోరుమిల్లి పుష్కరఘాట్‌లో అధికారులు భక్తుల రక్షణను అంతగా పట్టించుకోలేదు.  ఘాట్‌ చుట్టూ మూడు పడవలతోపాటు, ప్రమాద సూచికగా వెదరు గెడను మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులపుకున్నారు. కొవ్యూరు గోష్పాదక్షేత్రం ఘాట్‌లో భక్తులు పెద్ద సంఖ్యలో స్నానాలు ఆచరించారు. సోమవారం నుంచి భక్తుల రద్దీ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొవ్వూరులో అధికారికంగా మూడు ఘాట్లలోనే స్నానాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మిగిలిన ఘాట్లు మూసివేశారు. వీఐపీ(సుబ్రమణ్య) ఘాట్‌కు భక్తులు అంతంత మాత్రంగానే వచ్చారు. పట్టణ శివారున ఉన్న న్యూగౌతమీ ఘాట్‌లో కేవలం పదుల సంఖ్యలోనే  భక్తులు కనిపించారు.  వాడపల్లి, ఆరికిరేవుల, చిడిపి, కుమారదేవంలో భక్తులు స్వల్ప సంఖ్యలో స్నానాలు చేశారు. నర్సాపురంలో భక్తుల సంఖ్య పరవాలేదనిపిం చింది. నరసాపురం పట్టణంలో మూడు, రూరల్‌లో రెండు, మొత్తం ఐదు ఘాట్లలో అధికారులు స్నానాలకు ఏర్పాట్లు చేసారు. భక్తుల రద్దీ మొత్తం వలంధర్‌ఘాట్‌పైనే పడింది. తాళ్లపూడిలోని పార్వతీ సమేత ఉమామహేశ్వరస్వామి ఆలయం  నుంచి  ఉత్సవవిగ్రహలను పల్లకీపై ఊరేగింపుగా గౌతమీఘాట్‌ తీసుకు వచ్చి  అర్చకులు, భక్తులు  ప్రత్యేక పూజలు చేశారు.అంత్య పుష్కరాలకు ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు.
అనుకున్న స్థాయిలో రాలేదు
అంత్యపుష్కరాల తొలిరోజున యాత్రికులు అనుకున్నంత స్థాయిలో రాలేదు. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య అరలక్షలోపే ఉంటుందని  జిల్లా యంత్రాంగం పేర్కొంది. జిల్లావ్యాప్తంగా కేవలం 47,190 మంది మాత్రమే స్నానాలు ఆచరించినట్టు వివరించింది. దీనికి అధికారులు, ప్రభుత్వ ప్రచారలోపమే కారణంగా కనిపిస్తోంది. అంత్యపుష్కరాలపై ప్రభుత్వం అంతగా శ్రద్ధపెట్టలేదని, ఏర్పాట్లను నాలుగైదు రోజుల ముందే ప్రారంభించారని, ప్రచారం చేయడంలోనూ విఫలమయ్యారని, అందుకే యాత్రికులు అనుకున్నంత స్థాయిలో రాలేదనే భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  నరసాపురం డివిజన్‌లోని 15 స్నాన ఘట్టాల్లో సుమారు 27వేల మంది, జంగారెడ్డిగూడెం డివిజన్‌లో ఏర్పాటు చేసిన 20 స్నాన ఘట్టాల్లో సుమారు 10వేల మంది, కొవ్వూరు డివిజన్‌లో ఏర్పాటు చేసిన ఐదు స్నాన ఘట్టాల్లో 10వేల మంది భక్తులు పుష్కర స్నానమాచరించారని కలెక్టర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.  
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement