
ఈనెల 30న ఏపీలో పెట్రోల్ బంకుల బంద్
నగరంపాలెం(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్, పెట్రోలుపై ఫిబ్రవరి 6వ తేదీ నుంచి పెంచిన వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవాప్తంగా అన్ని పెట్రోలు బంకులు 24 గంటలపాటు మూసివేస్తున్నట్టు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. గుంటూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యాట్ వల్ల ఆరు నెలలుగా రాష్ట్రంలో పెట్రోలు అమ్మకాలు పూర్తిగా పడిపోయాయన్నారు.
బంకుల యజమానులు కరెంటు బిల్లులు, సిబ్బందికి జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వ్యాట్ రద్దు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎఫ్‌పీటీ జనరల్ సెక్రటరీ ప్రేమ్ రవికుమార్, ట్రెజరర్ గోలి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.