
రోష్నకి స్వీట్ తినిపిస్తున్న తల్లిదండ్రులు
సెకండియర్ ఎంపీసీ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ రోష్ని
ఫస్టియర్ ఎంపీసీలో స్టేట్ టాపర్‌గా
నిరుపేద విద్యార్థి సంతోష్‌కుమార్
విజయనగరం అర్బన్: చనిపోయిన తన అక్కే తనకు స్ఫూర్తి అని ఇంటర్ సెకండియర్ ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వారణాసి రోష్ని తెలిపారు. తన కంటే రెండేళ్లు పెద్ద అయిన అక్క శ్రావణి చదువులో ప్రతిభ చూపేదని, ఆమె హైస్కూల్లో చదువుతూ అకాల మరణం చెందడంతో అప్పటి నుంచి అక్కకు చదువుపై ఉన్న మక్కువను తాను స్ఫూర్తిగా తీసుకున్నానని ఆమె పేర్కొన్నారు. తన అక్క బతికుంటే ఎలా ప్రతిభ చూపేదో అలా రాణించాలనుకున్నానని చెప్పారు. ఉన్నత స్థాయి ఐఐటీ కళాశాలలో ఇంజనీరింగ్ చదవాలని ఉందనీ, ప్రజలకు అధికంగా ఉపయోగపడే, డిమాండ్ ఉన్న ఉత్పత్తుల తయారీ, పరిశోధనలకు సంబంధం ఉన్న ఇంజనీరింగ్ కోర్సులను ఎన్నుకుంటానని తెలిపారు.
మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో విజయనగరం పట్టణానికి చెందిన వారణాసి రోష్ని సెకండియర్ ఎంపీసీలో అత్యధిక మార్కులు (992/1000) సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 466/470 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్‌ను తెచ్చుకుంది. తండ్రి వారణాసి శ్రీనివాసరావు పట్టణంలోని మధ్యతరగతి వ్యాపారవేత్త, తల్లి ఉషారాణి గృహిణి. పదో తరగతిలో 9.8 మాత్రమే తెచ్చుకున్న ఈమె ఇంటర్‌లో రాష్ట్రస్థాయిలోనే టాపర్‌గా నిలిచింది.
ప్రతిష్టాత్మక ఐఐటీలో చదవాలనేదే నా లక్ష్యం: ప్రగతి
ఇంటర్మీడియెట్ ద్వితీయ ఎంపీసీ గ్రూప్‌లో సెకండ్‌ర్యాంకు సైతం విజయనగరం జిల్లాకే దక్కింది. పట్టణానికి చెందిన బలభద్రుని శివప్రగతి రాష్ట్రస్థాయి ద్వితీయ స్థానం సాధించింది. ఈమెకు 990 మార్కులు లభించాయి. ఈమె తండ్రి వెంకటరావు డుమా కార్యాలయంలో ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. అత్యున్నత ప్రమాణాలున్న ఐఐటీలో ఇంజనీరింగ్ చదివి దేశాభివృద్ధికి తన వంతు కృషిచేయాలన్నదే లక్ష్యమని చెప్పారు.