కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎస్. సత్యనారాయణ తెలిపారు. గురువారం కలెక్టర్ చాంబరులో కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈ నెల 28న నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతుందన్నారు. కౌంటింగ్‌కు 15 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో ఒక టేబుల్ రిటర్నింగ్ అధికారికి ఉంటుందని చెప్పారు. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందని వివరించారు.
ఒక టేబుల్‌కు ఒక కౌంటింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ఉంటారని తెలిపారు. ప్రతి టేబుల్‌కు ఒక సూక్ష్మ పరిశీలకుడు కూడా ఉంటారన్నారు. కౌంటింగ్ సిబ్బందిని సిస్టమ్ ద్వారా ర్యాండమైజేషన్ వివరించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, అదే తరహాలో కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఓ ఆనంద్‌నాయక్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ శశిదేవి, నిక్ అసిస్టెంట్ టెక్నికల్ డైరెక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.