వసంత పంచమికి ఏర్పాట్లు పూర్తి
వసంత పంచమికి ఏర్పాట్లు పూర్తి
Published Wed, Feb 1 2017 1:04 AM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM
-ముస్తాబైన కొలనుభారతి క్షేత్రం
- భక్తులకు వసతి ఏర్పాట్లు
- సామూహిక అక్షరాభ్యాసానికి
ప్రత్యేకంగా అర్చకుల నియామకం
కొత్తపల్లి: కొలనుభారతి క్షేత్రంలో బుధవారం వసంత పంచమిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఏకైక సరస్వతీ క్షేత్రం కొలను భారతి. దీంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. శ్రీశైలం దేవస్థానం నుంచి ఆలయ ఈఓ ..సరస్వతీ అమ్మవారికి పట్టువస్త్రాలు అందించటంతో అమ్మవారి పుట్టినరోజు వేడుకలు ప్రారంభం అవుతాయి. అంతకముందే ఆలయ పూజారులు అమ్మవారికి చారుఘోషిణి నదీజలాలతో భిషేకం నిర్వహిస్తారు. అనంతరం శ్రీశైలం నుంచి వచ్చిన పట్టువస్త్రాలతో అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరిస్తారు. అనంతరం వేదపండితులు వేదమంత్రాలను పఠిస్తూ వేడుకలను నిర్వహిస్తారు.
భక్తులకు సకల సౌకర్యాలు:
వసంత పంచమికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తారు. వారు చారుఘోషిణీ నదిలో స్నానం ఆచరించి దుస్తువులు మార్చుకునేందుకు తాత్కాలిక షెడ్లను నిర్మించారు. తాగునీటి, మరుగుదొడ్ల వసతులు కల్పించారు. భక్తులు తోపులాడుకోకుండా క్యూలైన్లను నిర్మించారు. అక్షరాభ్యాసానికి తరలివచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా విడిది ఏర్పాటు చేశారు. సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా అర్చకులను నియమించారు. భక్తులకు కాశిరెడ్డినాయన ఆశ్రమంలో అన్నదానం చేస్తారు. భక్తుల సౌకర్యార్థం నందికొట్కూరు, ఆత్మకూరు ఆర్టీసీ డిపో వారు కొలనుభారతి క్షేత్రానికి బస్సులను తిప్పనున్నారు. క్షేత్రానికి వచ్చే భక్తులు ఇబ్బందులకు గురికాకుండా, రాకపోకలకు అంతరాయం కలగకుండా ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, కొత్తపల్లి ఎస్‌ఐ శివశంకర్‌నాయక్ అధ్వర్యంలో 40 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక నిధులు మంజూరు చేయలేదు: సత్యనారాయణ, ఈఓ, చంద్రశేఖరయాదవ్, ఆలయ చైర్మన్
వసంత పంచమిని పురస్కరించుకొని ప్రతి ఏటా కొలను భారతి క్షేత్రాభివృద్ధికి నిధులు మంజూరు చేసేవారు. ఈ ఏడాది అమ్మవారి పుట్టినరోజు వేడుకలకు జిల్లా అధికారులు ఎలాంటి ప్రత్యేక నిధులు మంజూరు చేయలేదు. దేవాలయ ఖాతాలోంచి నిధులను తీసుకొని..వాటితోనే క్షేత్రంలో తోచినంతలో అభివృద్ధి పనులు చేపట్టాం.
Advertisement
Advertisement