వైభవంగా వసంత పంచమి
వైభవంగా వసంత పంచమి
Published Wed, Feb 1 2017 10:00 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM
- కొలనుభారతిక్షేత్రానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు
- సర్వసతీదేవికి పట్టువస్త్రాలు సమర్పించిన శ్రీశైల దేవస్థాన ఏఈఓ
-చిన్నారుల అక్షరాభ్యాసం వద్ద తోపులాట
కొలనుభారతి(కొత్తపల్లి): వసంతపంచమి వేడుకలు జిల్లాలో వైభంగా జరిగాయి. రాష్ట్రంలోని ఏకైక సరస్వతీ కేత్రం కొలనుభారతిలో భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి చిన్నారులకు పెద్ద ఎత్తున అక్షర్యాభ్యాసం చేయించారు. ఉదయం 5.30గంటల ప్రాంతంలో చారుఘోషిణీ నదీజలాలతో సర్వస్వతీదేవికి మంగళస్నానం చేయించారు. అనంతరం అమ్మవారికి పంచామృత సహిత మహన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం, విశేష అలంకరణ పుష్పార్చన, కుంకుమార్చన, మహానైవేద్యం, మహామంగళహారతి, తీర్థప్రసాద వితరణ పూజలు నిర్వహించారు.
పట్టువస్త్రాల సమర్పణ
శ్రీశైల భ్రమరాంబమల్లిఖార్జున స్వామివారి దేవస్థానం అసిస్టెంటు జేఈఓ మల్లిఖార్జునరెడ్డి, ప్రధాన అర్చకులు మల్లిఖార్జున, వేదపండితులు ఉదయం ఆరుగంటల ప్రాంతంలో సరస్వతీ అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. వారికి ఆలయకమిటీ ఈఓ సత్యనారాయణ, చైర్మన్ చంద్రశేఖరయాదవ్, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు అందజేసిన పట్టువస్త్రాలతో సరస్వతీ అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి పుట్టిన రోజు వేడుకలు ప్రారంభించారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు చారుఘోషిణీ నదీజలాల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని, సప్తశివాలయాల్లోని శివలింగాలను దర్శించుకున్నారు. కాశిరెడ్డినాయన ఆశ్రమం ఆధ్వర్యంలో భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు.
అక్షరాభ్యాసానికి పోటెత్తిన భక్తులు: వసంతపంచమిని పురుస్కరించుకుని కొలనుభారతిలో వెలసిన జ్ఞానసరస్వతీ అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు రాష్ట్రనలుమూలల నుంచి అధికసంఖ్యలో భక్తులు వచ్చారు. అమ్మవారి సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 850 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకున్నట్లు ఆలయపూజారి చంద్రశేఖరశర్మ తెలిపారు. అయితే, అక్షరాభ్యాసం చేయించే చోట ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అరగంటపాటు అక్షరాభ్యాస కార్యక్రమం నిలిపివేశారు.
కానరాని అధికారుల సందడి: ప్రతి ఏటా సరస్వతీ అమ్మవారి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యే కలెక్టర్, ఎస్పీ,వివిధ శాఖల జిల్లా అ ధికారులు, ప్రజాప్రతినిధులు ఈసారి క్షేత్రం వద్ద కనిపించలేదు. వారు వచ్చి ఉంటే క్షేత్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధిచేస్తామని గొప్పలు చెప్పి చేతులు దులుపుకుని వెళ్లేవారు. అధికారుల్లో బుధవారం ఆర్డీఓ సత్యనారాయణ ఒక్కరే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. క్షేత్రానికి వచ్చిన భక్తుల కోసం గోకవరం ప్రాథమిక వైద్యాధికారిణి దీపిక అధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, కొత్తపల్లి ఎస్సై శివశంకర్‌నాయక్ ల అధ్వర్యంలో 45మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.
Advertisement
Advertisement