సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీ అంశంపై శాసనమండలిలోనూ గందరగోళం చెలరేగింది. దీంతో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఒక బీజేపీ ఎమ్మెల్సీని ప్రస్తుత సమావేశాల కాలానికి సస్పెండ్ చేశారు. సోమవారం మండలి ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్, ఫారుఖ్‌హుస్సేన్, ఆకుల లలిత పోడియం వద్ద నిరసనలు చేపట్టారు. రైతులను ఆదుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. విపక్ష నేత షబ్బీర్ అలీ, బీజేపీ సభ్యుడు రామచంద్రరావు తమ స్థానాల నుంచే ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రశ్నోత్తరాల తర్వాత ఈ అంశంపై చర్చిద్దామని, సభలో ప్లకార్డులను ప్రదర్శించడం మంచి సంప్రదాయం కాదని చైర్మన్ స్వామిగౌడ్ కోరారు.
రైతుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర ్యలు తీసుకుంటోందని, కానీ కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. దీంతో విపక్ష సభ్యులు మరింతగా నిరసన తెలిపారు. ఈ పరిస్థితుల్లో సభను చైర్మన్ పది నిమిషాల పాటు వాయిదా వేశారు. విరామం అనంతరం కొంతసేపు ప్రశ్నోత్తరాలు సజావుగానే సాగాయి. అంతకుముందు మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు వెళ్లిన విపక్ష సభ్యులు తిరిగి సభలోకి వచ్చి... నిరసనలు మొదలుపెట్టారు. కూర్చోవాలని చైర్మన్ సూచించినా... వారు వెనక్కి తగ్గలేదు. దీంతో ఆయా సభ్యుల సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టాలన్న చైర్మన్ సూచన మేరకు మంత్రి తుమ్మల... ఐదుగురు కాంగ్రెస్, ఒక బీజేపీ సభ్యుడి పేర్లతో తీర్మానం పెట్టారు. దానిని ఆమోదిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
మండలిలోనూ అదే తీరు
Published Tue, Oct 6 2015 3:07 AM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM
Advertisement
Advertisement