సాక్షి, ముంబై : రైతుల రుణమాఫీ వ్యవహారం మహారాష్ట్రంలో రాజకీయంగా పెను కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. రైతుల డిమాండ్ల కోసం సొంత నేత యశ్వంత్ సిన్హా దీక్ష చేపట్టడం, బీజేపీ ప్రభుత్వ తీరు నచ్చక మరో నేత ఎంపీ అయిన నానా పటోలే ఏకంగా పార్టీకి గుడ్‌బై చెప్పిన పరిస్థితులు బీజేపీ ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారాయి. తాజాగా ఈ అంశంపై అధికారులు ఎంత చిత్తశుద్ధితో తెలియజేసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
రుణమాఫీ రైతుల పేర్ల జాబితాలో శివ సేన ఎమ్మెల్యే ప్రకాశ్ అబిట్కర్ పేరు కనిపించటం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొల్హాపూర్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ తరపున ఆయన రుణం కోసం దరఖాస్తు చేసినట్లు.. ఆయనకు 25 వేల రూపాయలు మంజూరు అయినట్లు ఉంది. కరువు ప్రాంత రైతులకు అందించిన రుణమాఫీ కింద ఆయనకు రుణం కూడా రద్దు అయ్యింది. దీనిపై స్పందించిన కొల్హాపూర్ ఎమ్మెల్యే ప్రకాశ్ అబిట్కర్ తాను ఎలాంటి రుణానికి దరఖాస్తు చేసుకోలేదని చెప్పటం విశేషం.‘‘ఆ వార్త మీడియాలోనే చూసి నేను తెలుసుకున్నా. షాక్‌కు గురయ్యాను. నేను ఎక్కడా నా పేరును నమోదు చేసుకోలేదు. ఆ రుణమాఫీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనిపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను కోరాను’’ అని ఆయన చెప్పారు.
కాగా, సుమారు 34 వేల కోట్ల రుణమాఫీ విషయంలో తప్పులు దొర్లిన మాట వాస్తవమేనని.. త్వరలో వాటిని సరిదిద్దుకుంటామని స్వయానా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ అంశం వెలుగులోకి వచ్చింది. రుణమాఫీ వ్యవహారం అంతా ముఖ్యమంత్రి కార్యాలయం పరిధిలో ఉండటంతో ప్రతిపక్షాలు ఫడ్నవిస్‌పై మండిపడుతున్నాయి.
శివ సేన ఎమ్మెల్యే ప్రకాశ్ అబిట్కర్
Comments
Please login to add a commentAdd a comment