Shiv Sena Leader
-
మహారాష్ట్ర మంత్రిగా మళ్లీ అతడు.. బీజేపీ మండిపాటు
ముంబై: చాలరోజుల సస్పెన్స్ తర్వాత ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవిస్‌ల మంత్రివర్గం మహారాష్ట్రలో కొలువు దీరింది. అయితే ఈ కేబినెట్ ప్రమాణ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్త కేబినెట్లోని సేన రెబల్ ఎమ్మెల్యే ఒకరి వల్ల బీజేపీ శ్రేణుల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తితో పాటు ఆగ్రహామూ వ్యక్తం అవుతోంది. సంజయ్ రాథోడ్.. యావత్మల్ జిల్లా దిగ్రాస్ నిజయోకవర్గపు ఎమ్మెల్యే. షిండే క్యాంప్‌లోని ఓ కీలక ఎమ్మెల్యే. ఇవాళ మంత్రిగా ప్రమాణం చేశాడు. అయితే ఆయన గతంలోనూ మంత్రిగా పని చేసి.. పదవి ఊడగొట్టుకున్నాడు. సంజయ్ రాథోడ్.. ఇంతకు ముందు ఉద్దవ్ థాక్రే కేబినెట్లో అటవీ శాఖ మంత్రి. ఓ మహిళతో సంబంధం నడిపి.. ఆమెను ఆత్మహత్యకు ఉసిగొల్పాడనే ఆరోపణలు బలంగా వచ్చాయి. పైగా అతనికి శిక్షపడాలని గట్టిగా పోరాటం చేసింది బీజేపీనే. ఈ క్రమంలో.. ఆనాడు ఉద్దవ్ థాక్రే, సంజయ్‌తో బలవంతంగా రాజీనామా చేయించాడు. కట్ చేస్తే.. ఇవాళ మంత్రివర్గ ప్రమాణంలో అతనూ పాల్గొన్నాడు. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిత్ర కిషోర్ వాగ్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ మహారాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిత్ర స్పందిస్తూ.. సంజయ్ రాథోడ్‌కు మళ్లీ మంత్రి పదవి దక్కడం దురదృష్టకరం. ఓ మహారాష్ట్ర బిడ్డను పొట్టనబెట్టుకున్నాడు అతను. అతనికి వ్యతిరేకంగా నా పోరాటం కొనసాగుతుందని అని ఆమె ప్రకటించారు. पुजा चव्हाण च्या मृत्युला कारणीभूत असणार्या माजी मंत्री संजय राठोड ला पुन्हा मंत्रीपद दिलं जाणं हे अत्यंत दुदैवी आहे संजय राठोड जरी पुन्हा मंत्री झालेला असला तरीही त्याच्या विरुद्धचा माझा लढा मी सुरूचं ठेवलेला आहे माझा न्याय देवतेवर विश्वास लडेंगे….जितेंगे 👍 @CMOMaharashtra pic.twitter.com/epJCMpvHLB — Chitra Kishor Wagh (@ChitraKWagh) August 9, 2022 టిక్‌టాక్ స్టార్ పూజా చవాన్‌తో సంజయ్ రాథోడ్ రిలేషన్షిప్ నడిపించాడు. అయితే వాళ్ల సంబంధం బెడిసి కొట్టడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సైతం వైరల్ అయ్యాయి. ఈ కేసులో ఆమెకు అరెస్ట్‌చేయాలంటూ బీజేపీ నిరసనగళం గట్టిగా వినిపించింది. అందులో ఇవాళ రాథోడ్‌తో ప్రమాణం చేసిన కిరీట్ సోమయ్య సైతం ఉండడం కొసమెరుపు. ఇదిలా ఉంటే.. గతంలో సంజయ్ రాథోడ్‌ను గద్దె దించే పోరాటంలో ముందున్న దేవేంద్ర ఫడ్నవిస్.. సమక్షంలోనే సంజయ్ రాథోడ్ మంత్రిగా ప్రమాణం చేయడం మరో హైలైట్. మరోవైపు షిండే సైతం రాథోడ్‌ను గత కొంతకాలంగా వెనకేసుకొస్తున్నాడు. పోలీసులు ఆయనకు క్లీన్ చిట్ఇచ్చారనే విషయాన్ని పదేపదే మీడియా ముందు గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆయనకు మంత్రి బెర్త్ దక్కుతుందన్న ఊహాగానాలే నిజం అయ్యాయి. పూజా చవాన్ కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం.. కిందటి ఏడాది అగష్టులో ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ, బీజేపీ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతూ వస్తూనే ఉంది. ఇదీ చదవండి: కర్ణాటకలో మళ్లీ ముఖ్యమంత్రి మార్పు? -
రౌత్‌కు మళ్లీ ఈడీ సమన్లు
న్యూఢిల్లీ/ముంబై: మనీ లాండరింగ్ కేసులో శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న ముంబైలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వాస్తవానికి సంజయ్ రౌత్ బుధవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఈడీ ఎదుటకు రాలేదు. ఆగస్టు మొదటి వారం వరకూ సమయం ఇవ్వాలని కోరుతూ సంజయ్ రౌత్ తన లాయర్ల ద్వారా ఈడీకి ఒక లేఖ పంపించారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్నానని, ఈడీ ఎదుటకు రాలేనని పేర్కొన్నారు. దీంతో ఈడీ ఆయనకు కొంత ఉపశమనం కలిగించింది. 27న హాజరు కావాలంటూ మరోసారి సమన్లు జారీ చేసింది. -
రుణమాఫీ లిస్ట్‌లో ఓ ఎమ్మెల్యే పేరు!
సాక్షి, ముంబై : రైతుల రుణమాఫీ వ్యవహారం మహారాష్ట్రంలో రాజకీయంగా పెను కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. రైతుల డిమాండ్ల కోసం సొంత నేత యశ్వంత్ సిన్హా దీక్ష చేపట్టడం, బీజేపీ ప్రభుత్వ తీరు నచ్చక మరో నేత ఎంపీ అయిన నానా పటోలే ఏకంగా పార్టీకి గుడ్‌బై చెప్పిన పరిస్థితులు బీజేపీ ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారాయి. తాజాగా ఈ అంశంపై అధికారులు ఎంత చిత్తశుద్ధితో తెలియజేసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రుణమాఫీ రైతుల పేర్ల జాబితాలో శివ సేన ఎమ్మెల్యే ప్రకాశ్ అబిట్కర్ పేరు కనిపించటం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొల్హాపూర్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ తరపున ఆయన రుణం కోసం దరఖాస్తు చేసినట్లు.. ఆయనకు 25 వేల రూపాయలు మంజూరు అయినట్లు ఉంది. కరువు ప్రాంత రైతులకు అందించిన రుణమాఫీ కింద ఆయనకు రుణం కూడా రద్దు అయ్యింది. దీనిపై స్పందించిన కొల్హాపూర్ ఎమ్మెల్యే ప్రకాశ్ అబిట్కర్ తాను ఎలాంటి రుణానికి దరఖాస్తు చేసుకోలేదని చెప్పటం విశేషం.‘‘ఆ వార్త మీడియాలోనే చూసి నేను తెలుసుకున్నా. షాక్‌కు గురయ్యాను. నేను ఎక్కడా నా పేరును నమోదు చేసుకోలేదు. ఆ రుణమాఫీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనిపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను కోరాను’’ అని ఆయన చెప్పారు. కాగా, సుమారు 34 వేల కోట్ల రుణమాఫీ విషయంలో తప్పులు దొర్లిన మాట వాస్తవమేనని.. త్వరలో వాటిని సరిదిద్దుకుంటామని స్వయానా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ అంశం వెలుగులోకి వచ్చింది. రుణమాఫీ వ్యవహారం అంతా ముఖ్యమంత్రి కార్యాలయం పరిధిలో ఉండటంతో ప్రతిపక్షాలు ఫడ్నవిస్‌పై మండిపడుతున్నాయి. శివ సేన ఎమ్మెల్యే ప్రకాశ్ అబిట్కర్ -
శివసేన కార్యకర్త అరెస్ట్
ముంబయి: మంగళవారం ఘాట్కోపర్ శివార్లలోని దామోదర్ పార్క్ ఏరియాలో అకస్మాత్తుగా ఐదు అంతస్తుల భవనం కూలిపోయి 17 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి శివసేన కార్యకర్త అరెస్టయ్యాడు. సునీల్ సితాప్ నర్సింగ్ హోమ్ పునర్నిర్మాణ సమయంలో ఈ భవనం కూలిపోయింది. సితాప్ నిర్లక్ష్యం వలనే భవనం కూలిందని కేసు నమోదయింది. నిన్న రాత్రి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. -
ఉద్ధవ్ థాకరే తనయుడికి తప్పిన ప్రమాదం
ముంబై: శివసేన యువజన నేత ఆదిత్య థాకరే(26) కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారును మరో కారు ఢీకొనడంతోఘీ ఈ ప్రమాదం జరిగింది. ముంబైలోని కళానగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిగ్నల్ దాటుకుని వచ్చిన మారుతి కారు, తమ కారును ఢీకొట్టిందని థాకరే సన్నిహితుడు ఒకరు వెల్లడించారు. ప్రమాదం సమయంలో థాకరే భయంతో వణికిపోయినట్టు కనిపించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదానికి కారణమైన మారుతి కారు డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో తనకేమి కాలేదని, తాను క్షేమంగా ఉన్నానని ఆదిత్య థాకరే ట్విటర్ ద్వారా వెల్లడించారు. సిగ్నల్ జంప్ చేసి వచ్చిన కారు ప్రమాదానికి కారణమని తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని, కార్లు రెండు కూడా బాగానే ఉన్నాయన్నారు. తనకోసం తపించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే కుమారుడైన ఆదిత్య పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. -
లేడీ కానిస్టేబుల్‌పై నాయకుడి ప్రతాపం!
సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని చెప్పినందుకు డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై ఓ రాజకీయ నేత దాడి చేశాడు. ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. విధి నిర్వహణలో పక్కాగా ఉన్నందుకు ఆమెకు దక్కిన బహుమానమిది. ముంబై నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రైవింగ్ చేస్తూ, సెల్ఫోన్లో మాట్లాడుతున్నందుకు మహిళా కానిస్టేబుల్ అతని కారును ఆపారు. దీంతో ఆవేశంతో ఊగిపోతూ సదరు వ్యక్తి కారు దిగుతూనే కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నాడు. మహిళ అని కూడా చూడకుండా దారుణంగా కొట్టాడు. ముంబైలో జరిగిన ఈ దాడి దృశ్యాలు సీసీటీవీ కెమేరాకు చిక్కాయి. బాధిత కానిస్టేబుల్ ఈ ఘటనపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడ్డ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని శివసేన పార్టీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే తమ పార్టీకి.. ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదంటూ శివసేన చెబుతోంది. -
శివసేన నాయకుడిపై కాల్పులు
శివసేన నాయకుడు అనిల్ చౌహాన్‌పై కాల్పులు జరిగాయి. వెంటనే ఆయనను భక్తివేదాంత ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయమే ఆయనపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఉత్తర ముంబైలోని కశ్మీరియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనిల్ చౌహాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దుండగులు ఎవరు, ఆయనపై ఎందుకు కాల్పులు జరిపారన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. దీనిపై తమకు ఫిర్యాదు అందిందని, నిందితులను గుర్తించి పట్టుకునేందుకు గాలింపు మొదలుపెట్టామని ముంబై పోలీసు అధికారి అవినాష్ అంబురే తెలిపారు. -
శివసేన నాయకుడిపై కత్తులతో దాడి
థానే : మహారాష్ట్ర థానేలోని హజౌరి ప్రాంతంలో స్థానిక శివసేన నాయకుడు ధర్మేంద్ర చౌబేపై ఆగంతకులు కత్తులతో దాడి చేశారు. అనంతరం ఆగంతకులు పరారయ్యారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వాగ్లే ఎస్టేట్స్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ధర్మేంద్రను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని పోలీసులు చెప్పారు. స్థానిక సమస్యల కారణంగానే ధర్మేంద్రపై దాడి చేసినట్లు భావిస్తున్నామని వాగ్గే ఎస్టేట్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ దిలీప్ సోలంకే తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ దాడి శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. -
టీచర్‌ను వేధించిన శివసేన నేతపై కేసు
సాక్షి, ముంబై: జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలితో అసభ్యకరంగా ప్రవర్తించారన్న ఆరోపణపై శివసేన మాజీ తాలూకా అధ్యక్షుడు గణేష్ అధానేపై ఔరంగాబాద్ జిల్లా కుల్‌తాబాద్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో గణేష్ అదానేను పార్టీ నుంచి బహిష్కరించారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా, తిరిగి ఈ నెల 6వ తేదీన గణేష్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆ ఉపాధ్యాయురాలు ఆరోపించారు. తనను లొంగదీసుకునేందుకు బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని చెప్పారు. గణేష్ అదానే కుటుంబసభ్యుల సమస్యను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రేకు ఓ లేఖ రాయడంతో ఆయన 18న ముంబైలోని శివసేన కార్యాలయానికి పిలిపించుకుని అన్ని విషయాలు తెలుసుకున్నారని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని సీరీయస్‌గా తీసుకున్న ఉద్ధవ్ ఠాక్రే వెంటనే గణేష్‌ను శుక్రవారం పార్టీ నుంచి బహిష్కరించారు. ఇది జరిగిన వెంటనే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
బాలికను తల్లిని చేసిన శివసేన నేత.. అరెస్టు
తాను నడిపించే స్కూల్లో చదువుతున్న ఓ బాలికపై అత్యాచారం చేసి.. ఆమెను తల్లిని చేసిన శివసేన నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే ఆ బాలిక ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాసుదేవ్ నంబియార్ (61) జిల్లా శివసేన ఉప నాయకుడు. ఆయనకు కాశ్మీరియా టౌన్షిప్లో ఓ స్కూలు ఉంది. ఆ స్కూల్లో చదివే అమ్మాయి విషయంలోనే నంబియార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ అమ్మాయిని గుడికి తీసుకెళ్లే నెపంతో పలుమార్లు ఆయన బయటకు తీసుకెళ్లారని, థానెలోని ఓ ప్రాంతంలో ఆమెపై పదే పదే అత్యాచారం చేశారని పోలీసులు చెప్పారు. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారు. అనంతరం ఆ బాలిక గర్భవతి అయ్యి.. ఈ వారం మొదట్లోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది.దాంతో ఆస్పత్రి నిర్వాహకులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే పోలీసులు నంబియార్‌పై కేసు పెట్టి, అరెస్టు చేశారు. స్థానిక మేజిస్ట్రేట్ వద్ద హాజరు పరచగా సెప్టెంబర్11వ తేదీ వరకు పోలీసు కస్టడీకి ఇచ్చారు.