ఎడమొహం.. పెడమొహం
సాక్షి, ముంబై: 15 ఏళ్ల అనంతరం అధికారం దక్కించుకున్న బీజేపీ, శివసేన కూటమి ఎడమొహం పెడమొహంగానే ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కాషాయ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గత తొమ్మిది నెలలుగా గడిచినా ఇరుపార్టీల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు మాత్రం తొలగిపోలేదు. రైతుల రుణాలు మాఫీ చేసి తీరాల్సిందే అని శివసేన పట్టుబట్టుతోంది. అయితే బీజేపీ మాత్రం తొలుత మెతక వైఖరి అవలంబించినప్పటికీ తర్వాత రుణమాఫీ సాధ్యం కాదని తేల్చి చెప్పింది.
ఇక గోందియా, జిల్లా పరిషత్ ఎన్నికలైతే రాష్ట్ర వ్యాప్తంగా కలకలం ృసష్టించాయి. అక్కడ కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య పొత్తు వికటించడంతో కొత్త రాజకీయ సమీకరణాలు చోటుచేసుకుంటున్నాయని వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి వారంలోనే స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన బీజేపీ, గోందియాలో అదే పార్టీతో జతకట్టింది. ఇది రాజకీయ వర్గాలను తీవ్ర విస్మయానికి గురిచేసింది.
రగిలిపోయిన శివసేన..
గోందియాలో బీజేపీ, కాంగ్రెస్ జతకట్టడంపై రగిలిపోయిన శివసేన, ప్రతిపక్షాలకు వంతపాడింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, పుట్టుకతో శత్రువులైనా మిత్రులుగా మారిపోతారని నిప్పులు చెరిగింది. అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గులాబ్‌రావ్ పాటిల్, అర్జున్ ఖేత్కర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు శతవిధాల ప్రయత్నించారు. రైతుల రుణాల మాఫీ చేయడమే అసెంబ్లీలో ప్రధానం అంశం కావడంతో బీజేపీ ఏకాకిగా మారిపోయింది.
అయిన్పప్పటికీ ప్రతిపక్షాల సవాళ్లకు దీటుగా సమాధానమిస్తూ సభ కార్యకలాపాలు ముందుకు సాగించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రెండు రోజులు ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు అసెంబ్లీ భవనం ఎదుట ఆందోళన చేపట్టారు. రైతు రుణాలు మాఫీ చేయాలని నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీలో ఇదే అంశంపై మొదటి వారమంతా చర్చ జరిగింది. రోజు అసెంబ్లీ బయట జరుగుతున్న వివాదం యావత్ రాష్ట్ర ప్రజల దృష్టి రుణ మాఫీపై పడింది. మరోపక్క అధికారంలో ఉంటూనే పరోక్షంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న శివసేన వైఖరి వల్ల బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతోంది.
దూరం పెరిగింది అప్పుడే..
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరుపార్టీల మధ్య మొదలైన ముసలం ఇప్పుడిప్పుడే సమసిపోయేలా కనిపించడం లేదు. సీట్ల సర్దుబాటు విషయంలో మొదలైన భేదాలు, చివరికి 20 ఏళ్ల స్నేహాన్ని దూరం చేశాయి. విడివిడిగా పోటీ చేసి మోదీ మేనియాతో 120 సీట్లకు పైగా సాధించిన బీజేపీ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. తొలుత ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ముందు బలనిరూపణ చేసుకున్నా..
తర్వాత పాత కాపు శివసేనను ప్రభుత్వంలోకి ఆహ్వానించింది. చాలా రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించింది. అయితే అధికారం లేని పదవులతో ఏం చేసుకోవాలంటూ కొద్ది రోజుల్లోనే కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇరు పార్టీల పెద్దల భేటీ అనంతరం గొడవలు కాస్త సద్దుమనిగాయి. కానీ వైరం మాత్రం రోజురోజుకీ ముదిరి పాకాన పడుతోంది.