ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గురువారం వేకువ జామున గుర్తు తెలియని వ్యక్తులు ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎం మిషన్ను ఎత్తుకుపోయారు. వివరాలివీ.. ఆదోని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల రోడ్డులో ఇండియన్‌బ్యాంక్ ఏటీఎం ఉంది. గురువారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు మిషన్‌ను పెకిలించి, ఎత్తుకుపోయారు. అందులోని సీసీ కెమెరాలు పనిచేయటం లేదని సమాచారం. ఏటీఎంలో రూ.5.27 లక్షల నగదు ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై బ్యాంకు సిబ్బంది మూడో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు.
ఇంతకు ముందు దుండగులు ఏటీఎం మిషన్‌లకు కన్నం వేయడం చూశాం గానీ.. ఇలా మిషన్నే ఎత్తుకెళ్లిన ఘటనను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు పాల్పడిన వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.