: సీసీ పుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు, మేనేజర్
- క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ పరిశీలన
- దర్యాప్తు చేపట్టిన పోలీసులు
టేకులపల్లి : ఏటీఎంలో డబ్బులు చోరీ చేసేందుకు ఓ యువకుడు యత్నించిన సంఘటన మండల కేంద్రంలో గురువారం వెలుగుచూసింది. ఎస్సై తాటిపాముల సురేష్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని ఎస్‌బీహెచ్ ఏటీఎం కేంద్రంలోకి ఓ యువకుడు గురువారం తెల్లవారుజామున ముఖానికి గుడ్డ కట్టుకుని.. రాడ్డు, కటింగ్ ప్లేయర్‌తో ప్రవేశించాడు. లోపల ఉన్న సీసీ కెమెరాను కిందకు వంచాడు. మరో కెమెరాను గమనించకుండానే రాడ్డుతో ఏటీఎం యంత్రం తలుపును ధ్వంసం చేసి.. డబ్బులు ఉన్న బాక్సును తెరిచేందుకు విశ్వప్రయత్నం చేశాడు. డిజిటల్ లాక్‌ను బలవంతంగా తొలగించి.. దాని వైర్లను కటింగ్ ప్లేయర్‌తో కత్తిరించాడు. ఎంతకూ డబ్బులు బయటకు రాకపోవడంతో విసుగు చెంది వెళ్లిపోయాడు. ఉదయం 6 గంటలకు ఏటీఎం కేంద్రంలో ఊడ్చేందుకు వచ్చిన స్వీపర్ సోమయ్య విషయాన్ని గుర్తించి చుట్టుపక్కల వారికి సమాచారం అందించాడు. మేనేజర్ అమరేశ్, ఎస్సై సురేష్, ఏఎస్సై అజీజ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది దొంగతనం జరిగిన విధానాన్ని పరిశీలించారు. బోడురోడ్డు సెంటర్, దాసుతండా, రేగులతండా, సింగ్యతండా మీదుగా లచ్చతండా వైపు దొంగ కోసం అన్వేషిస్తున్న క్రమంలో వర్షం కురవడంతో శునకంతో తనిఖీలు నిలిపివేశారు. బ్యాంకు మేనేజర్ సహాయంతో క్లూస్‌టీం, పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు.