అరాచక పర్వం..
అరాచక పర్వం..
Published Mon, Aug 22 2016 5:01 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
పెచ్చుమీరుతున్న ముఖ్య నేత తనయుడి దౌర్జన్యకాండ
ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి వసూళ్లు
వాటాలు ఇవ్వలేదని..
రైల్వే పనులు చేస్తున్న వారిపై దాడి
కన్ను పడితే కబ్జాలు.. ల్యాండ్ కన్వర్షన్లు.. ఏ పనికైనా ఓ రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడతారు. ఆ రెండు నియోజకవర్గాల్లో రోడ్డు పనైనా, దేవాలయం అభివృద్ధి పనులైనా, చివరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగే రైల్వే పనులైనా సరే వీరికి పర్సంటేజీ ఇవ్వాల్సిందే. లేదంటే పనులు జరగనివ్వరు... మొదట పోలీసులతో హెచ్చరికలు పంపుతారు. అప్పటికీ వినకపోతే తప్పుడు కేసులు బనాయిస్తారు. ఎదురుతిరిగితే దాడులకు సైతం తెగబడతారు.. ఇదీ జిల్లాలోని ఓ ముఖ్య నేత తనయుడి అరాచక పర్వం.
సాక్షి, గుంటూరు: నడికుడి –శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణ పనులను అడ్డుకుని అక్కడ పనులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, కూలీలపై దాడులు చేయించి వాహనాలను ధ్వంసం చేసిన ఘటన ఆదివారం జరిగింది. రాజుపాలెం మండలం పెదనెమలిపురి గ్రామం వద్ద నుంచి నకరికల్లు మండలం మీదుగా రొంపిచర్ల వరకు 16 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మాణ పనులు ఐదు నెలలుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్య నేత తనయుడి కళ్ళు ఈ పనులపై పడ్డాయి. వెంటనే తనకు పర్సంటేజీ పంపాలంటూ రెండు నెలల క్రితం సదరు కాంట్రాక్టర్‌కు హుకుం జారీ చేశాడు. మాట వినకపోవడంతో అప్పట్లో వాహనాలను తీసుకెళ్ళి పనులు నిలిపి వేయించాడు. కాంట్రాక్టర్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వద్ద పంచాయతీ పెట్టడంతో నెలపాటు పనులు యథావిధిగా జరిగాయి. అయితే ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో రైల్వే పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళిన ముఖ్య నేత తనయుడి అనుచరులు వాహనాలను ధ్వంసం చేసి, ఉద్యోగులు, కూలీలపై విచక్షణా రహితంగా దాడులు చేసి భయానక వాతావరణం సృష్టించారు. భయభ్రాంతులకు గురైన కూలీలు పరుగులు తీశారు. మా నాయకుడి అనుమతి లేకుండా పనులు చేయడానికి మీకెంత ధైర్యంరా.. అంటూ కర్రలు, రాడ్‌లతో వారిపై విరుచుకుపడ్డారు. పర్సంటేజీ ఇచ్చి పనులు చేసుకోవాలంటూ కాంట్రాక్టర్ తరఫున పనిచేసే సైటు ఇన్‌చార్జిలకు వార్నింగ్‌లు ఇచ్చారు.
జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఏ పనిచేయాలన్నా ఆయన అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఏ ఫైల్‌పై సంతకం పెట్టాలన్నా, అధికారులు ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూడాల్సిందే. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రెండు నియోజకవర్గాల్లో ముఖ్య నేత తనయుడు చేస్తున్న దౌర్జన్యకాండకు ఎందరో వ్యాపారులు, కాంట్రాక్టర్లు, చివరకు రైతులు సైతం బలైపోయి తీవ్రంగా నష్టపోయారు. ఈయనకు అధికార పార్టీ మంత్రులన్నా, చివరకు ముఖ్యమంత్రి మాటన్నా... లెక్కలేదు. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు, కాంట్రాక్టర్ల వద్ద వసూళ్ళకు పాల్పడుతున్నారు. లాటరీ విధానంలో మద్యం దుకా ణం దక్కించుకున్న ప్రతి ఒక్కరి వద్ద ఒక్కో షాపునకు రూ.20 లక్షల చొప్పున వసూలు చేశారు. ఒక్క ఎకరా వ్యవసాయ భూమి ల్యాండ్ కన్వర్షన్ చేయాలన్నా ముఖ్య నేత తనయుడికి కప్పం కట్టాల్సిందే. బార్ లైసె న్సు రెన్యూవల్ చేయాలన్నా, వ్యాపార సముదాయాల నిర్మాణం జరగాలన్నా ఆయన వాటా ఆయనకు ఇస్తేనే ఫైల్ ముందుకు కదులుతోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులతో జరిగే ఏ పనులకైనా సదరు కాంట్రాక్టర్లు ఆయన అడిగినంత పర్సంటేజీ ముట్టజెప్పిన తరువాత మాత్రమే పనులు నిర్వహించాల్సి ఉంటుంది. అలా కాదని ఎదురు తిరిగితే ఆయన అనుచరులు, కొంత మంది గూండాలతో కలిసి దౌర్జన్యంగా పనులను నిలిపివేయడం, అక్కడ ఉండే వాహనాలను ధ్వంసం చేయడం, చివరకు కూలీలు, అధికారులను సైతం కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కొత్తగా పీబీటీ పేరుతో ప్రతి ఒక్కరి నుంచి టాక్స్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఈయన దౌర్జన్యాలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Advertisement
Advertisement