వర్సిటీ కీర్తిని పెంచేది విద్యార్థులే
Published Sat, Jul 23 2016 5:54 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
వర్సిటీ కీర్తిని పెంచేది విద్యార్థులే
–ఏయూ వీసీ ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు
వర్సిటీ,కీర్తి,ఏయూ,au,fame,students
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం కీర్తిని ఇనుమడింపజేసేది విద్యార్థులేనని ఏయూ ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఉదయం ఏయూ అసెంబ్లీ మందిరంలో సైన్స్, ఆర్ట్స్ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వర్సిటీలో ఈ రెండేళ్లు ఎంతో విలువైనవని, కాలాన్ని వృథా చేసుకోరాదని హితవు పలికారు. ఆచార్యుల నుంచి జానాన్ని పొందడానికి నిరంతరం శ్రమించాలని, అదే నిజమైన సంపదగా నిలుస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. మహనీయుల జీవిత చరిత్రలను చదివి స్ఫూర్తిపొందాలన్నారు. సర్వేపల్లి వంటి మహనీయులు నడయాడిన పుణ్యభూమిగా ఏయూ ఖ్యాతిగాంచిందని, అలాంటి చోట చదుకునే అవకాశం రావడం అదృష్టంగా భావించి అవకాశాలను సద్వినియోగంచేసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థీ నోబెల్ బహుమతిని సాధించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తెలుగు మాధ్యమం విద్యార్థులు శ్రమిస్తే పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించగలరన్నారు. ర్యాగింగ్ రహితంగా వర్సిటీని తీర్చిదిద్దామని చెప్పారు. ఎలాంటి చిన్న సంఘటన ఎదురైనా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. రెక్టార్ ఆచార్య ఇ.ఎ. నారాయణ మాట్లాడుతూ విభిన్న అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు తమ పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని సూచించారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి రామన్ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్య విజయాన్ని అందిస్తుందని చెప్పారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.గాయత్రీ దేవి మాట్లాడుతూ విద్య అమరత్వాన్ని అందిస్తుందన్నారు. విద్యార్థి వ్యవహరాల డీన్ ఆచార్య పి.హరి ప్రకాష్, ఆచార్య టి.శోభశ్రీ, టి.వి క్రిష్ణ, జి.సుధాకర్, షారోన్ రాజు, రామారావు, ఎన్.ఏ.డి పాల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement