అదుపుతప్పిన ఆటో
-
విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఒకరి మృతి
-
ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆలమూరు :
గుమ్మిలేరులో మంగళవారం అదుపు తప్పిన ఆటో ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సంఘటనలో ఇంజరపు సత్యనారాయణ (52) అనే వ్యక్తి మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. రావులపాలెం నుంచి మండపేటకు బయలుదేరిన ఆటోలో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. స్థానిక బస్టాండ్ సమీపంలో వేగంగా వచ్చిన ఆటో అదుపుతప్పి, రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో రావులపాలెం కొత్త కాలనీకి చెందిన సత్యనారాయణకు తలకు, కాలికి తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మరణించాడు. రాయవరం మండలంలోని వెదురుపాకకు చెందిన అనుసూరి వీరన్న, అనుసూరి సత్యవతికి తీవ్ర గాయాలు కావడంతో, వారిని 108లో మండపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆటోడ్రైవర్ వి.మహలక్ష్మి సహా మిగిలిన ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని ఎస్సై ఎం.శేఖర్‌బాబు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రామచంద్రపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాపు చేస్తున్నారు.