కర్నూలు జిల్లాలో దారుణం వెలుగుచూసింది.
మంత్రాలయం(కర్నూలు):
కర్నూలు జిల్లాలో దారుణం వెలుగుచూసింది. పాఠశాలకు వెళ్లి వస్తున్న అభం శుభం తెలియని విద్యార్థినిపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. భయాందోళనకు గురైన బాలిక తనను తాను రక్షించుకోవడానికి ఆటోలో నుంచి కిందకు దూకింది. దీంతో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ సంఘటన జిల్లాలోని మంత్రాలయం మండలం మాధవరంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థిని(11) పాఠశాల నుంచి ఇంటికి వెళ్లడానికి ఆటో ఎక్కింది. ఆటోలో ఎవరు లేకపోవడంతో.. డ్రైవర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. అప్రమత్తమైన బాలిక ఆటోలో నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.