ఆటో ఆతిథ్యం.. చౌక ధరలో విదేశీ రుచులు | auto food service started in city | Sakshi
Sakshi News home page

ఆటో ఆతిథ్యం.. చౌక ధరలో విదేశీ రుచులు

Published Fri, Sep 2 2016 9:35 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

ఆటో ఆతిథ్యం.. చౌక ధరలో విదేశీ రుచులు - Sakshi

ఆటో ఆతిథ్యం.. చౌక ధరలో విదేశీ రుచులు

సాక్షి,వీకెండ్: నేషనల్‌ బేకరీ స్కూల్‌ లండన్‌ నుంచి డిగ్రీ పొందిన అనీషా, యూకేలో ఫైనాన్స్‌లో మాస్టర్‌ డిగ్రీ పట్టా అందుకున్న ఉర్వశ్‌ కన్నా, ఆశిశ్‌ ఇమాన్యుల్‌లు తలచుకుంటే ఆరంకెల జీతంతో ఉద్యోగం వలచి వరించేదే. అయితే రొటీన్‌ జాబ్‌పై ఆసక్తి లేని ఈ ముగ్గురి ఆలోచనలకు రూపమే హాట్‌ డాగ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆటో. ‘రోడ్‌ మీద ఫాస్ట్‌ఫుడ్‌ అందించాలి. అది ఇక్కడి వారికి హైజీన్‌గా, హైటేస్టీగా అనిపించాల’ని ఆలోచించిన ఈ మిత్ర బృందం... అంతర్జాతీయంగా పాపులర్‌ అయిన హాట్‌ డాగ్‌ వంటకాలని ఇక్కడ పరిచయం చేయాలని నిర్ణయించుకుంది. బ్రిటీష్‌ వంటకాల్లో ఒకటి హాట్‌ డాగ్‌. వాటిలో చికెన్‌ హాట్‌ డాగ్స్‌ వీరు తయారు చేస్తున్నారు.

వీటి కోసం వాడే బ్రెడ్, సాస్‌లు అన్నీ వీరే తయారు చేస్తుండడం విశేషం. సిటీలో హాట్‌ డాగ్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. ‘మొదట ఫుడ్‌ ట్రక్స్‌ అనుకున్నాను. అయితే పెద్ద వెహికల్స్‌ సిటీ ట్రాఫిక్‌లో కష్టమని, ఆటోలు అయితే బెటర్‌ అనిపించింది. ఎన్‌ఐడీ బెంగుళూర్‌ విద్యార్థుల సహకారంతో ఈ ఆటోలు డిజైన్‌ చేయించాం. గతేడాది జనవరిలో ఈ ఆటో ఫుడ్‌ సర్వీస్‌ ప్రారంభించాం. తొలుత మూడు ఆటోలతో ప్రారంభించినా.. తర్వాత నగరవ్యాప్తంగా 12 ఏర్పాటు చేశాం. సోషల్‌ మీడియా ప్రచారంతో చాలా మంది మాకు రెగ్యులర్‌ కస్టమర్లుగా మారార’ని చెప్పారు డైరెక్టర్‌ ఉర్వశ్‌ కన్నా.

హాట్‌ డాగ్‌ ఆన్‌ కాల్‌..
పార్టీ, గెట్‌ టు గెదర్‌.. ఇలా ఈవెంట్‌ సిటీలో, శివార్లలో ఎక్కడ ప్లాన్‌ చేసుకున్నా అక్కడికి ఈ హాట్‌ డాగ్‌ ఆటోలు వచ్చేస్తాయి. కాల్‌ చేస్తే సరాసరి ఈవెంట్‌ జరుగుతున్న చోటుకే ఆటో వచ్చేస్తుంది. అయితే హాట్‌ డాగ్‌ల ఖరీదు తప్ప దీని కోసం ప్రత్యేకమైన చార్జీలు ఉండవు. మసాల దినుసులతో స్పైసీగా ఉండే ఇన్‌సేన్, కెచప్, మస్టర్డ్‌తో ఉండే క్లాసిక్‌ అమెరికన్‌ హాట్‌ డాగ్‌ రెబెల్, నేరుగా చేతితో ముట్టుకోకుండా తయారు చేసిన చికెన్‌ సాసేజ్‌ హాట్‌ డాగ్‌లు రెండు రకాల సాస్‌లతో ఈ ఆటో వడ్డించే మెనూలో సిద్ధంగా ఉన్నాయి. పెద్ద సింగిల్‌ హాట్‌ డాగ్‌ రూ.60, మూడు చిన్న హాట్‌ డాగ్స్‌ ప్యాక్‌ రూ.99 ధరల్లో అందిస్తున్నారు.

వీటి తయారీలో సైతం స్నేహ బృందం స్వయంగా పాలుపంచుకుంటూ రుచుల విషయంలో కేర్‌ తీసుకుంటుండడం విశేషం. ‘డిజైన్, టేస్ట్‌ విషయంలో పూర్తి నిర్ణయం నాదే. సాస్‌లు అన్నీ నేను తయారుచేసినవే. ఇందులో చెఫ్‌్సకి ట్రైనింగ్‌ కూడా ఇస్తున్నాను. తప్పనిసరిగా ఫ్రెష్‌ బ్రెడ్‌నే వాడుతాం. బ్రెడ్స్‌ మిగిలితే చారిటీకి ఇచ్చేస్తాం. ఆటోలో ఉన్న ఎక్విప్‌మెంట్‌ సైతం మేం డిజైన్‌ చేసిందేన’ని చెప్పారు చెఫ్‌ అనీషా. ‘డిజైనింగ్, రీసెర్చ్, ఫారిన్‌ ట్రిప్స్, ఎక్విప్‌మెంట్, ఆటోలు... ఇలా అంతా కలుపుకుని రూ.కోటి పెట్టుబడితో 2015లో వ్యాపారం ప్రారంభించాం. బెంగుళూర్‌కూ మా సర్వీస్‌ విస్తరిస్తున్నామ’ని చెప్పారు డైరెక్టర్‌ ఆశిశ్‌ ఇమాన్యుల్‌.  
 

నిర్వాహకులు.. ఆశిశ్‌ ఇమాన్యుల్, అనీషా, ఉర్వశ్‌ కన్నా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement