అవినీతి పండించారు | aviniti pandimcharu | Sakshi
Sakshi News home page

అవినీతి పండించారు

Published Wed, Jan 25 2017 10:59 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

అవినీతి పండించారు - Sakshi

అవినీతి పండించారు

మొక్కలు వేయకుండానే సబ్సిడీలు మింగేశారు
 రూ.3 కోట్ల వరకు మెక్కేశారు
 కామవరపుకోట కేంద్రంగా అధికార పార్టీ నేతలు పంచుకున్నారు
 ఉద్యాన శాఖలో భారీ కుంభకోణం
విత్తనం వేస్తే మొక్క రావటం.. ఆ మొక్క పెరిగి పెద్దదై ఫలాలు ఇవ్వడం సహజం. కానీ.. మంత్రిగారి నియోజకవర్గంలో ఎంపీ వర్గానికి చెందిన టీడీపీ నేతలు విత్తనాలు చల్లలేదు. మొక్కలూ నాటలేదు. కాగితాలపై మాత్రం పంటలు పండించేశారు. అవినీతి అనే పంట నుంచి రూ.3 కోట్ల దిగుబడి సాధించారు. తిలాపాపం.. తలాపిడికెడు అన్నట్టుగా ఫలహారం కానిచ్చేశారు. కామవరపుకోట కేంద్రంగా ఉద్యాన శాఖలో ఈ తంతు సాగింది.
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
కనీసం పంట కూడా వేయకుండానే కోట్లాది రూపాయల సబ్సిడీలను దిగమింగిన వైనం రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చోటుచేసుకుంది. మూడేళ్లుగా ఉద్యాన పంటలు వేస్తున్నట్టు రికార్డుల్లో చూపించి కోట్లాది రూపాయల సబ్సిడీలను నొక్కేశారు. వాటాల పంపకాల్లో వివాదాలు తలెత్తి తెలుగుదేశం నాయకులు పోట్లాడుకోవడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. జెడ్పీటీసీ, ఓ గ్రామ ఉప సర్పంచ్‌ దీనిపై పంచాయితీ చేసి.. రూ.9 లక్షలు వెనక్కి ఇవ్వాలని అధికారిని కోరడం.. అందుకు అంగీకరించిన అధికారి ఆ మొత్తాన్ని ఇవ్వకుండా పదోన్నతిపై శ్రీశైలం వెళ్లిపోవడం.. ఎట్టిపరిస్థితుల్లో వాటా సొమ్ము ఇవ్వాలని పట్టుబట్టడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాగులో ఉన్న కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటల్లో కొత్త తోటలు వేసినట్టుగా చూపించి మూడేళ్ల కాలంలో రూ.3.50 కోట్లను సబ్సిడీ రూపంలో డ్రా చేసి రూ.3 కోట్ల వరకు బొక్కేసినట్టు సమాచారం. చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని కామవరపుకోట, మంకెనపల్లి, తడికలపూడి, కొండగూడెం తదితర గ్రామాల్లో మంత్రి పీతల సుజాతకు తెలియకుండా ఎంపీ మాగంటి బాబు వర్గానికి చెందిన నేతల ఈ వ్యవహారం చక్కబెట్టినట్టు తెలిసింది. రైతులను ఉద్యాన పంటల వైపు ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తోంది. దీనిని అవకాశంగా మలుచుకుని ఆ శాఖ అధికారులతో కుమ్మక్కై తెలుగుదేశం నాయకులు అవినీతికి తెరలేపారు.
 
రెవెన్యూ రికార్డుల్లో లేని భూముల్లోనూ..
ఒకే సర్వే నంబర్లతో రెండుచోట్ల సబ్సిడీ  తీసుకోగా.. అసలు రెవెన్యూ రికార్డుల్లో లేని సర్వే నంబర్లనూ చేర్చి సబ్సిడీ  తీసుకున్నారు. ఎక్కడా కొత్తగా పంటలు వేయకపోవడం గమనార్హం. వారు సబ్సిడీలు తీసుకున్న భూముల్లో దశాబ్దాల కాలంగా కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటలు ఉన్నాయి. 
 
సాక్ష్యాలివిగో.. 
 + గంటా వీర వెంకట సత్యవరప్రసాద్‌కు కామవరపుకోట రెవెన్యూ పరిధిలోని 127/1,2, 128/2 సర్వే నంబర్లలో భూమి ఉంది. ఈ నంబర్లతో 201617 సంవత్సరానికి తడికలపూడిలో జామ తోట పెంపకం పేరుతో రూ.43,118 ఽసబ్సిడీ తీసుకున్నారు. ఈ సర్వే నంబర్లలో భూమి కోటేశ్వరరావు, వెంకయ్య పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉంది.  ఇదే సర్వే నంబర్లతో 201415లో కూర అరటి తోటలు వేసినట్టు చూపించి తడికలపూడిలో రూ.1,62,297 సబ్సిడీ డ్రా చేశారు. ఈ భూమి ఏలూరి లక్ష్మీనారాయణ పేరుతో రికార్డుల్లో ఉంది. ఈ భూమిలో దాదాపు 30 సంవత్సరాల వయసు గల కొబ్బరి, కోకో, నిమ్మ తోటలు ఉన్నాయి. 
 
+ గంటా నాగేశ్వరరావు 169/3, 172/1 సర్వే నంబర్లలో గల భూమిలో అరటి తోట వేసినట్టుగా రూ.59,756ను సబ్సిడీ రూపంలో తీసుకున్నారు. 117/7 సర్వే నంబర్‌ భూమిలో కర్ర పెండలం వేసినట్టుగా రూ.లక్ష మొక్కేశారు. అయితే, ఈ భూమి అతని తండ్రి గంటా వెంకయ్య పేరుతో ఉంది. 
+  గోపాలకృష్ణ అనే వ్యక్తి 41/2ఎ సర్వే నంబర్‌తో కూర అరటి తోట వేసినట్టు చూపించి రూ.1,16,854 సబ్సిడీ తీసుకున్నారు. నిజానికి ఈ  భూమి ఎం.ముసలయ్య పేరుతో ఉంది. దీన్ని కూడా తన పొలంలో కలిపేసుకుని సబ్సిడీ డ్రా చేశారు. ఈ స్థలంలో అసలు అరటి తోట వేయలేదు. సొంగా స్వామిదాస్‌ పేరుతో రూ.54,099 డ్రా చేశారు.
 
ఒక్క మండలంలోనే రూ.3.36 కోట్లు
సబ్సిడీలు డ్రా చేసిన సర్వే నంబర్లకు సంబంధించి కొన్ని రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నాట్‌ ఫౌండ్‌ అని వస్తుంటే, కొన్నిచోట్ల అసలు సర్వే నంబర్లు లేవు. గడచిన మూడేళ్లలో అరటికి రూ.1,85,72,466, కోకో పంటకు రూ.1,01,93,600, కర్ర పెండలానికి రూ.42,55,300, నిమ్మకు రూ.5,08,031, జామకు రూ.1,63,142 కలిపి మొత్తం రూ.3.36 కోట్ల సబ్సిడీని ఒక్క కామవరపుకోట మండలంలో డ్రా చేశారు. ఇందులో 80 నుంచి 90 శాతం వరకూ టీడీపీ నాయకులు వేరే పేర్లతో పంటలు వేయకుండానే మింగేశారు. 
 
వాటాల పంపకంలో విభేదాలొచ్చి..
వాటాల పంపకాల్లో విభేదాలు రావడంతో టీడీపీ నేతలు పంచాయితీ పెట్టారు. సదరు ఉద్యాన అధికారిని పిలిచి ఆయన వాటాకు ఇచ్చిన సొమ్ములో రూ.9 లక్షలు తిరిగి ఇవ్వాలని పెద్దమనుషుల ఒప్పందం చేశారు. ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించిన సదరు అధికారి ఫిబ్రవరి నెలలో ముట్టజెబుతానని చెప్పాడు. ఈలోగా శ్రీశైలం దేవస్థానానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లిపోయారు. ఈ విభేదాల నేపథ్యంలో టీడీపీ నేత ఒకరు ’మీ కోసం’ కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు. దీంతో లెక్కలు సరిచేసే పనిలో ఉద్యాన శాఖ అధికారులు నిమగ్నమై ఉన్నట్టు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశిస్తే మరింత అవినీతి వెలుగుచూసే అవకాశం ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement